
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న.. 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు.. సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రావులు ఉన్నారు. స్వామినాథన్ సతీమణి మీనా స్వామినాథన్ గతేడాది కన్నుమూశారు. ఇక, స్వామినాథన్ 1925 ఆగస్టు 7న కుంభకోణంలో ఎంకే సాంబశివన్, పార్వతి తంగమ్మాళ్ దంపతులకు జన్మించారు. అక్కడే పాఠశాల విద్యను అభ్యసించారు.
వ్యవసాయ శాస్త్రంలో ఆసక్తి, మహాత్మా గాంధీ ప్రభావంతో ఎంఎస్ స్వామినాథన్.. వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు. స్వామినాథన్ భారత్‌లో 'హరిత విప్లవం విజయం కోసం ఇద్దరు కేంద్ర వ్యవసాయ మంత్రులు సి సుబ్రమణ్యం (1964-67), జగ్జీవన్ రామ్ (1967-70,1974-77)తో కలిసి పనిచేశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు, ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది.
వ్యవసాయ రంగంలో స్వామినాథ్ కృషికి గానూ.. ఆయనకు 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ లభించింది. ఈ ప్రైజ్ మనీని చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించడానికి ఉపయోగించారు. తద్వారా స్థిరమైన, సమగ్ర వ్యవసాయ పద్ధతుల పట్ల తన నిబద్ధతను మరింత సుస్థిరం చేశాడు. ఇక, 1971లో రామన్ మెగసెసే అవార్డ్, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా స్వామినాథన్ అందుకున్నారు. స్వామినాథన్ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వేదికలపై కూడా ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు సహకరించారు. భారత ప్రభుత్వం కూడా స్వామినాథన్‌ను 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది.