కరోనా వైరస్ వణికిస్తున్నవేళ భారతీయ ఔషధ దిగ్గజం గ్లెన్మార్క్, కరోనా తో పోరాడే మందును తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసింది.
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్నవేళ భారతీయ ఔషధ దిగ్గజం గ్లెన్మార్క్ ఒక శుభవార్తను తెలిప్పింది. కరోనా తో పోరాడే మందును తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మూడు దశల్లో కూడా పూర్తయినతరువాతే ఈ డ్రగ్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఫవిపిరవిర్ అనే పేరుగల ఈ డ్రగ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. ఫాబిఫ్లూ అనే బ్రాండ్ పేరుతో ఈ మందును మార్కెట్లోకి విడుదల చేయడానికి శుక్రవారమే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్టుగా తెలిపారు కంపెనీ ప్రతినిధులు.
దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ మందును అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే ఈ మందును అమ్మడం జరుగుతుందని, ఒక్క టాబ్లెట్ ఖరీదు 103 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపారు.
ఇక కరోనా వైరస్ బారినపడ్డ వారు తొలిరోజు 1800 ఎంజి డోస్ ను రెండు సార్లు వేసుకోవాలని, ఆతరువాత 14 రోజులపాటు 800 ఎంజి రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని అన్నారు. హృద్రోగులు, డయాబెటిస్ రోగులు కూడా వాడొచ్చని తెలిపారు.
ఇకపోతే... భారత్ లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
గత 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,048 కు పెరిగింది. అలాగే కొత్తగా 375 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కు చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ 4 వ స్థానంలో ఉండటం గమనార్హం.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ భారీగానే ఉంది. రోజుకి దాదాపు 500కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో 7వేలు దాటేసింది. దాదాపు 8వేలకు చేరువలో ఉంది.