1971లో కరాచీ పోర్ట్‌పై దాడి: ఇండియన్ నేవీ విరోచిత గాధ..!!

By Siva KodatiFirst Published Jan 23, 2021, 10:21 PM IST
Highlights

1971లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారతీయ నౌకా దళం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా నాటి స్మృతులను గుర్తు చేసేందుకు నేవీ సిద్ధమవుతోంది.

1971లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారతీయ నౌకా దళం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా నాటి స్మృతులను గుర్తు చేసేందుకు నేవీ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నౌకాదళానికి చెందిన నౌక నుంచి క్షిపణి దూసుకొస్తున్నట్లుగా వున్న నమూనాను ప్రదర్శించారు. 

ఈ నమూనా ముందు భాగం కరాచీ నౌకాశ్రయంపై క్షిపణి దాడిని దాడిని చూపిస్తుంది. వెనుక భాగం సీ హాక్, అలైజ్ విమానాలతో వున్న విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను చూపిస్తుంది.

గుజరాత్‌లోని ఓఖా నుంచి కమొడోర్‌ బబ్రూభాన్‌ యాదవ్‌ ఐఎన్‌ఎస్‌ నిపట్‌లో బయలుదేరారు. ఐఎన్‌ఎస్‌ నిర్ఘట్‌, ఐఎన్‌ఎస్‌ వీర్‌ తదితర మిసైల్‌ బోట్లు దానిని అనుసరించాయి. ఈ మిసైల్‌ బోట్ల రాడార్‌ రేంజ్‌ తక్కువ కావడంతో కొన్ని కార్వెట్లను కూడా ఈ బృందంలో చేర్చారు.

 

 

ఈ నౌకలన్నీ 1971 డిసెంబర్‌ 4 మధ్యాహ్నం కరాచీకి 460 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుని... అక్కడ ఆగిపోయాయి. అంతకుమించి వెళితే... పాక్‌ యుద్ధ విమానాల రేంజ్‌లో అడుగుపెట్టినట్లే. పాక్‌ యుద్ధ విమానాల్లో చాలావాటికి రాత్రి పోరాడే సామర్థ్యం లేదు.

దీనిని ఆసరాగా చేసుకుని భారత యుద్ధ నౌకలు రాత్రిపూట మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి కరాచీకి చేరువయ్యాయి. పాక్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కరాచీకి 130 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుని దాడులు మొదలుపెట్టాయి.

ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి వచ్చిన విమానాలు తూర్పు పాకిస్తాన్ నౌకలు , తీరప్రాంతాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించడంతో పాటు బంగ్లాదేశ్ విముక్తికి ఎంతో దోహదపడ్డాయని భారత నావికాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ చెప్పారు.

 

 

తాము ఈ విజయాన్ని జరుపుకునేటప్పుడు, నావికా చరిత్రలో అద్భుతమైన అధ్యాయాన్ని వ్రాసిన నావికాదళ సిబ్బంది యొక్క ధైర్యం , త్యాగాన్ని కూడా తాము గుర్తించామని ఆయన తెలిపారు. ఈ పట్టికలో మహావీర్ చక్ర ఎనిమిది మంది నావికా పురస్కార గ్రహీతల ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. అందులో ఒకటి మరణానంతరం బహుకరించబడింది. 

ఇరు వైపులా యుద్ధంలో పాల్గొన్న వివిధ నౌకలను, ముక్తి బాహినితో పాటు నేవీ చేపట్టిన కమాండో ఆపరేషన్స్ (ఆపరేషన్ ఎక్స్), ఢాకాలో  పాక్ సేనలు లొంగిపోయిన దృశ్యాలను ఇందులో ప్రదర్శించారు. 
 

click me!