లడఖ్‌ ల్యాండింగ్ స్ట్రిప్‌ను ఎయిర్‌బేస్‌గా మార్చనున్న భారత్.. ఇక చైనాకు చుక్కలే

Siva Kodati |  
Published : Aug 24, 2023, 07:47 PM IST
లడఖ్‌ ల్యాండింగ్ స్ట్రిప్‌ను ఎయిర్‌బేస్‌గా మార్చనున్న భారత్.. ఇక చైనాకు చుక్కలే

సారాంశం

తూర్పు లడఖ్‌లోని నియోమాలోని అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్‌జీ)లో రాఫెల్, సుఖోయ్ 30 ఎంకేఐ, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ వంటి యుద్ధ విమానాలను నడపగల పూర్తి స్థాయి ఎయిర్‌బేస్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇప్పటికే శ్రీనగర్‌లో అత్యాధునిక మిగ్ 29 విమానాలను రంగంలోకి దించింది. అలాగే తన ఎయిర్ డ్రాపింగ్ సామర్ధ్యాన్ని సైతం మెరుగుపరచుకుంది. తాజాగా తూర్పు లడఖ్‌లోని నియోమాలోని అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్‌జీ)లో రాఫెల్, సుఖోయ్ 30 ఎంకేఐ, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ వంటి యుద్ధ విమానాలను నడపగల పూర్తి స్థాయి ఎయిర్‌బేస్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

అనేక రౌండ్ల కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న , ఎన్నో  ఏళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) నుంచి న్యోమా ఏఎల్‌జీ కేవలం 35 కి.మీ దూరంలో వుంది. అందువల్ల ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. భారత వైమానిక దళంలోని రవాణా విమానం ఏఎన్-32 2009లో నియోమా ఎయిర్‌స్ట్రిప్‌లో దిగింది. అప్పటి వరకు ఇక్కడ కేవలం హెలికాఫ్టర్లను మాత్రమే ఐఏఎఫ్ దించింది. 

న్యోమా ఏఎల్‌జీని ఎయిర్‌బేస్‌గా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వ్యూహాత్మక లడఖ్‌లోని భారత బలగాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. సియాచిన్‌లోని కార్యకలాపాలకు మద్ధతు ఇచ్చే పార్తాపూర్ ఎయిర్‌బేస్ కూడా ఇక్కడికి దగ్గరలోనే వుండటం విశేషం. ఏఎల్‌జీలు పూర్తి స్థాయిలో ఎయిర్‌బేస్‌లు కావు.. కానీ ల్యాండింగ్ స్ట్రిప్స్‌ను దళాలు, సామాగ్రిని దించడానికి, యుద్ధ విమానాలకు ఇంధనం నింపుకోవడానికి ఉపయోగించవచ్చు. 

భారత్‌కు ప్రస్తుతం లడఖ్‌లో రెండు ఎయిర్‌బేస్‌లు వున్నాయి. ఒకటి లేహ్‌లో, మరొకటి పార్తాపూర్‌లో. ఈ రెండు ప్రాంతాలకు యుద్ధ విమానాలను నడుపుతున్నారు. అయితే ఈ ఎయిర్‌బేస్‌లు ఎల్ఏసీ నుంచి 100 కి.మీకు పైగా దూరంలో వున్నాయి. ఇదే సమయంలో మూడు ఏఎల్‌జీలు ఎల్‌ఏసీకి చాలా దగ్గరగా వున్నాయి. దౌలత్ బేగ్ ఓల్డీ 9 కిలోమీటర్లు, న్యోమా 35 కి.మీ, ఫక్చే 14 కి.మీ దూరంలో వున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2013లో సీ 130 జే సూపర్ హెర్క్యులస్ వ్యూహాత్మక రవాణా విమానాన్ని ల్యాండ్ చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్ అయిన దౌలత్ బేగ్ ఓల్డీ ఏఎల్‌జీని యాక్టివేట్ చేసింది. ప్రస్తుతం సీ 130 జే , సీ 17 గ్లోబ్ మాస్టర్ III, చినూక్స్ వంటి రవాణా విమానాలు, అటాక్ హెలికాఫ్టర్ అపాచీలు ఏఎల్‌జీల నుంచి పనిచేయగలవు. 

చినూక్‌తో సహా ఐఏఎఫ్ రవాణా విమానాల సాయంతో ఏ సమయంలోనైనా సైనికులు, ఆయుధాలను ఎల్ఏసీకి తరలించాలన్నది సైన్యం లక్ష్యం. భారతదేశ వేగవంతమైన నిర్మాణాలు చైనా దళాల కదలికపై ఒత్తిడిని పెంచాయి. దీంతో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎల్ఏసీ సమీపంలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలను అడ్డుకోవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?