పంద్రాగస్టు వేడుకల్లో ఒలింపిక్ విన్నర్స్, కొవిడ్ వారియర్స్‌.. కంప్లీట్ షెడ్యూల్

By telugu teamFirst Published Aug 14, 2021, 7:46 PM IST
Highlights

75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారి వైమానిక దళం పూల వర్షాన్ని కురిపించనుంది. ప్రత్యేకంగా ఒలింపిక్ విజేతలు, కరోనా వారియర్లను వేడుకలకు ప్రభుత్వం ఆహ్వానించింది. పంద్రాగస్టున లాల్ ఖిల్లాలో జరిగే వేడుకల షెడ్యూల్ ఇలా ఉండనుంది.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం ఘనంగా ఈ వేడుకలు జరగనున్నాయి. కరోనా కారణంగా గతేడాది తరహాలోనే వేడుకలో అతిథులు, వీక్షకులు స్వల్ప సంఖ్యలో ఉండనున్నారు. ఉదయమే ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగరేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో మార్చి నెలలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలు 2023 ఆగస్టు 15వరకు  కొనసాగనున్నాయి.

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈ సారి వినూత్నంగా జరగనున్నాయి. వైమానిక దళం పూల వర్షాన్ని కురిపించనుంది. 32 మంది ఒలింపిక్ విన్నర్లు, కరోనా వారియర్లు ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పూర్తి షెడ్యూల్ ఇలా ఉన్నది..

లాల్ ఖిల్లాకు ప్రధాని ఆగమనం:
ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ లాల్ ఖిల్లా విచ్చేయగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్‌లు స్వాగతిస్తారు.

గౌరవవందనం:
లాల్ ఖిల్లాకు రాగానే ప్రధానమంత్రి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసుల నుంచి ఒక అధికారి, 20 మంది సభ్యుల చొప్పున బృందాలు ప్రధానికి గౌరవవందనం సమర్పిస్తాయి. ఈ ఏడాది భారత నౌకదళం గౌరవవందనాన్ని సమన్వయపరుస్తున్నది. 

గౌరవవందనం స్వీకరిస్తూ ప్రధాని మోడీ రెడ్ ఫోర్ట్‌పైనకు చేరుకుంటారు. అక్కడ రాజ్‌నాథ్ సింగ్, అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మైరల్ కరంబీర్ సింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియాలను కలుసుకుంటారు. ఢిల్లీ ఏరియా జీవోసీ ప్రధానికి పతాకావిష్కరణ వేదికకు తీసుకువెళ్తారు.

పతాకావిష్కరణ:
లాల్ ఖిల్లాపై ప్రధాని మోడీ జాతీయజెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్రీయ సెల్యూట్ ఉంటుంది. 16 మందితో కూడిన నేవీ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తుంది. గన్ సెల్యూట్ కూడా ఉంటుంది.

పూల వర్షం:
భారత స్వాతంత్ర్య వేడుకల్లో తొలిసారి వైమానిక దళం పూలను వెదజల్లనుంది. ప్రధానమంత్రి జెండావిష్కరణ చేసిన తర్వాత వేడుక ప్రాంగణంలో పూలను కురిపించనుంది. అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం ముగియగానే ఎన్‌సీసీ క్యాడెట్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. 500 క్యాడెట్లు ఇందులో పాల్గొంటారు.

ఒలింపిక్ విజేతలు, కరోనా వారియర్లు:
ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 32 మంది ఒలింపిక్ విజేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో నీరజ్ చోప్రాతోపాటు ఇద్దరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులుంటారు. సుమారు 240 మంది ఒలింపియన్స్, సపోర్ట్ స్టాఫ్, ఇతర క్రీడా విభాగ  అధికారులను కేంద్రం ఆహ్వానించింది. వీరితోపాటు కరోనాపై అవిశ్రాంత పోరు సల్పుతున్న కరోనా వారియర్లను గౌరవిస్తూ వారిని వేడుకలకు ఆహ్వానించింది. వారి కోసం దక్షిణంవైపున ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు.

click me!