వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. ఎక్కడెక్కడ అంటే?

By Mahesh KFirst Published May 15, 2022, 1:46 PM IST
Highlights

ఐఎండీ తాజాగా, వర్షాలపై మరో హెచ్చరిక చేసింది. వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ కేరళ, లక్షద్వీపాలకు వార్నింగ్ ఇచ్చింది. ఐదు రోజులపాటు ఇక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
 

న్యూఢిల్లీ: ఈ ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి మండే ఎండలు రికార్డులు బద్దలు చేస్తున్నాయి. అయితే, అప్పుడప్పుడు వరుణుడూ కరుణిస్తున్నాడు. ఇటీవలే అసని తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాలు కొంత చల్లబడ్డాయి. తాజాగా, వాతావరణ శాఖ మరోసారి ఓ చల్లటి కబురు చెప్పింది. వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే, ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కాదు.. కేరళ, లక్షద్వీపాల్లో భారీ వర్షాలు కురువనున్నట్టు వెల్లడించింది. పశ్చిమ నుంచి పవనాలు అరేబియన్ సముద్రం మీదుగా దక్షిణ భారతం వైపు వస్తున్నాయని, వీటి వల్లే ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కలిసి కురవనున్నట్టు పేర్కొంది. అంతేకాదు, భారీ వేగంతో వీచే గాలులు వర్షం వెంటే రానున్నట్టు అంచనా వేసింది. కేరళ, లక్షద్వీపాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. 

ఈ ఐదు రోజులు జాలర్లు సముద్రాల్లో వేటకు వెళ్లరాదని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ భారీ వర్షాల వల్ల కలిగే ముప్పు, దాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన వివరాలను ఐఎండీ రూపొందించింది. ఈ క్రమంలోనే ప్రజలు లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శిథిలావస్తలో ఉన్న ఇంటిలో ఉండరాదని వివరించింది. ఐఎండీ హెచ్చరికలతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్న మధ్య కేరళలోని ఎర్నాకుళం, ఇదుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఇదిలా ఉండగా, ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే మన దేశంలోకి ఎంటర్ కాబోతున్నట్టు ఐఎండీ రెండు మూడు రోజుల క్రితం వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. ఒక్కోసారి జూన్ 10 వరకు కూడా వస్తుంటాయి. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో తెలంగాణకు వస్తాయి.

అయితే, ఈ సారి నైరుతి రుతుపవనాలు మే 27వ తేదీనాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. అంటే, నాలుగు రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చేయనున్నట్టు వివరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ రుతుపవనాల కారణంగా మన దేశంలో వర్షాలు కురుస్తాయి.

click me!