కాంచీపురం, చెంగల్పట్టుకు రెయిన్ అలర్ట్ ఇస్తే.. చెన్నైలో వాన ఎలా పడింది, కారణమిదే..!!!

By Siva KodatiFirst Published Nov 9, 2021, 2:54 PM IST
Highlights

ప్రతిసారి ప్రజలను, ప్రభుత్వాన్ని హెచ్చరించే ..వాతావరణ శాఖ (imd) చెన్నై వాసులకు ఎలాంటి భారీ వర్ష సూచన చేయలేదు. కాంచీపురం (kanchipuram) , చెంగల్పట్టు (chengalpattu) జిల్లాలకు మాత్రమే రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కానీ మద్రాస్‌లో ఆ రెండు జిల్లాలను మించి 207 మిల్లీమీటర్ల మేర కుండపోత వాన కురిసింది.

గత కొన్నిరోజులుగా చెన్నై మహానగరాన్ని భారీ వర్షం (chennai rains) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కుంభవృష్టి కారణంగా నగరం దాదాపు నీటమునిగింది. అయితే ప్రతిసారి ప్రజలను, ప్రభుత్వాన్ని హెచ్చరించే ..వాతావరణ శాఖ (imd) చెన్నై వాసులకు ఎలాంటి భారీ వర్ష సూచన చేయలేదు. కాంచీపురం (kanchipuram) , చెంగల్పట్టు (chengalpattu) జిల్లాలకు మాత్రమే రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కానీ మద్రాస్‌లో ఆ రెండు జిల్లాలను మించి 207 మిల్లీమీటర్ల మేర కుండపోత వాన కురిసింది. 2015 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే ప్రథమం. ఈ పరిణామం వాతావరణ శాఖను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

దీనిపై వాతావరణ శాఖ దక్షిణాది విభాగం చీఫ్ బాలచంద్రన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను 'మెసస్కేల్ ఫినామినా' అంటారని తెలిపారు. ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేమని తెలిపారు. చెన్నైలోని నుంగంబాక్కం (nungambakkam) , మీనంబాక్కం (meenambakkam) మధ్య కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమేనని, కానీ నుంగంబాక్కంలో 20 సెంటిమీటర్లు, మీనంబాక్కంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యత్యాసంతో వర్షపాతం నమోదవడం 'మెసస్కేల్ ఫినామినా' కిందికి వస్తుందని బాలచంద్రన్ పేర్కొన్నారు. 

ALso Read:తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో పాఠశాలలు బంద్..

రోజువారీ పరిశోధనలో భాగంగా ఈ నెల 6కి సంబంధించి గాలి దిశ, మేఘాల కదలికలను పరిశీలిస్తున్నప్పుడు తమ అంచనాల్లో చెన్నై నగరం లేదన్నారు. అందుకే చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకు మాత్రం భారీ వర్షసూచన ఇచ్చామని బాలచంద్రన్ వెల్లడించారు. కానీ చెన్నై నగరంలో ఊహించని విధంగా కొద్ది గంటల్లోనే కుంభవృష్టి కురిసిందని ఆయన చెప్పారు. 

మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చెన్నై నగర పాలక సంస్థపై మద్రాసు హైకోర్టు (madras high court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడాదిలో సగం రోజులు నీటికోసం గగ్గోలు పెడతారని, మరో ఆరు నెలలు నీటిలోనే చనిపోయేట్టు చేస్తారంటూ మండిపడింది. 2015 వరదల తర్వాత గత ఐదేళ్లలో అధికారులు ఏం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ పీడీ ఆదికేశవుల ధర్మాసనం నిలదీసింది. పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ అంశంపై సుమోటాగా విచారణ చేపడతామని ధర్మాసనం హెచ్చరించింది. 
 

click me!