
తిరువనంతపురం: శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి ఎక్కువ కాలుష్యం వస్తుందని తెలిసిందే. శిలాజ ఇంధనాలతో తీయడం మూలంగా ఏర్పడే పర్యావరణ సమస్యలతోపాటు వాటిని మండించడం ద్వారా (వినియోగించడం) కూడా కాలుష్యం వస్తుంది. అందుకే పర్యావరణ మార్పుల నుంచి బయటపడటానికి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయ వనరుల కోసం అన్వేషణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా పవన శక్తి, సౌర శక్తి సహా పలు మార్గాలను అవలంభించడం మొదలవుతున్నది. వాహనాల కోసం విద్యుత్‌ను ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కాకుండా విద్యుత్ ఇంధనంగా వినియోగించే వాహనాల నుంచి కాలుష్యం వెలువడదని తెలిసిందే.
కానీ, కేరళ పోలీసుల చేసిన ఓ చర్య వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఓ ఎలక్ట్రిక్ వాహనానికి కేరళ పోలీసులు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ సమర్పించలేదని ఫైన్ వేయడం.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కేరళ పోలీసులను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.
మలప్పురం జిల్లా కరువరకుండు పోలీసు స్టేషన్ పరిధిలో నీలాంచెరి సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా ఝుళిపించడానికి కేరళ పోలీసులు గత వారం చెకింగ్ ప్రారంభించారు. అటు వైపుగా వచ్చిన వాహనాలను అడ్డుకుని వాహనాలకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో పరిశీలించి విడిచిపెట్టారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనంపై అక్కడకు వచ్చాడు.
పోలీసులు ఆ వ్యక్తికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ చూపెట్టలేదని రూ. 250 ఫైన్ వేశారు. దీనిపై స్పందిస్తూ.. ఇది టైపో అని పోలీసులు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఓ పోలీసు ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనం పై వచ్చిన ఓ వ్యక్తి తన డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించలేదు. కనీసం సాఫ్ట్ కాపీ కూడా చూపెట్టలేకపోయాడు. ఈ అఫెన్స్ కు జరిమానా విధిస్తూ సదరు పోలీసు అధికారి తప్పుగా టైప్ చేశాడు. మెషీన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం కాకుండా పొల్యూషన్ కోసం టైప్ చేసి ఉంటాడని ఆ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆ వాహనం రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేక పోవడానికి ఎక్కువ జరిమానా పడుతుందని వివరించారు.
అలాంటప్పుడు పెద్ద అమౌంట్‌కు బదులు తక్కువ అంత తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకున్న సదరు పోలీసు అధికారికి జరిగిన తప్పిదం తెలియరాకపోవడం ఆశ్చర్యకరం. ఇతర పోలీసులూ ఆ పొరపాటును గుర్తించకపోవడం గమనార్హం. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ లేని ఆ వ్యక్తి నుంచి తక్కువ పెనాల్టీ తీసుకుని వదిలిపెట్టడం కూడా ఆశ్చర్యకరంగానే ఉన్నదని చర్చిస్తున్నారు.
అయితే, కొన్ని పోలీసు వర్గాలు చెబుతున్న విషయాలు వాస్తవ చిత్రాన్ని చూపుతున్నట్టుగా ఉన్నాయి. సాధారణంగా ప్రయాణికులు ఏ డాక్యుమెంట్లు వెంట తెచ్చుకోవడం మరిచిపోయినా.. లేదా ఇతర పొరపాట్లు జరిగినా వాటికి పడే పెనాల్టీలు తగ్గించాలని వేడుకుంటూ ఉంటారని, అలాంటప్పుడు సదరు వ్యక్తులకు పెనాల్టీ లను తగ్గించి పెద్ద అఫెన్స్ కు బదులు చిన్న అఫెన్స్ ను ఎంచుకుని తక్కువ ఫైన్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి.