హిందులవులకు, భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చి చంపేస్తామని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే యోగి తరహా పాలన అమలు చేస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు నాయకులు తమ ప్రత్యర్థి అభ్యర్థిపై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఉద్వేగంలో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అలాంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి - ప్రధాని నరేంద్ర మోడీ..
విజయపురలో సోమవారం బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార సభలో ఆయన హిందువులకు, భారత్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కాల్చి చంపుతామని హెచ్చరించారు. ‘‘మీరు మా విశ్వాసం గురించి లేదా భారతదేశం గురించి లేదా హిందువుల గురించి మాట్లాడితే.. అప్పుడు మిమ్మల్ని కాల్చి చంపుతాం (చేతితో సంజ్ఞ చేస్తూ)’’ అని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ శైలి పాలనను అమలు చేస్తామని ఎమ్మెల్యే యత్నాల్ చెప్పారు. భారత్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎదుర్కొంటామని చెప్పారు. ‘వారిని జైలుకు పంపడం మానేస్తాం. రోడ్డుపైనే నిర్ణయం తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
యూపీ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో ముగ్గురు దుండగుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేరస్థులతో వ్యవహరించే తీరును ప్రస్తావిస్తూ యత్నాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దారుణం.. బాకీ కట్టలేదని ఆరో తరగతి చదివే కూతురును తీసుకెళ్లి రెండో పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి..
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు, ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు లౌడ్ స్పీకర్లలో అజాన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేత పేర్కొన్నారు. కొందరు ముస్లింలు మైకులను ఉపయోగించి ఆజాన్ చేయడం ద్వారా అల్లాను అవమానిస్తున్నారని ఈశ్వరప్ప వాదించారు. ‘‘అల్లాహ్ వింటాడు. కానీ వారు ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు మైక్రోఫోన్లను (అజాన్ కోసం) ఏర్పాటు చేస్తారు. అప్పుడే అది అల్లా చెవుల్లోకి వెళ్తుందా?’’ అని బీజేపీ నేత ప్రశ్నించారు. కాగా.. కర్ణాటకలో మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న కౌంటింగ్ జరగనుంది.