
తిరువనంతపురం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షెడ్యూల్డ్ తెగలు, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏనాడూ పని చేయలేదని పేర్కొన్నారు. దేశం నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోందని, ప్రపంచం కమ్యూనిస్టు పార్టీలను దూరం చేస్తోందని, కేరళకు భవిష్యత్తు ఉంటే అది భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తోనేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. దక్షిణాది రాష్ట్రం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
షెడ్యూల్డ్ తెగలు, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏనాడూ కృషి చేయలేదన్నారు. "వారు వాటిని కేవలం ఓటు బ్యాంకులుగా పరిగణించారు" అని అమిత్ షా ఆరోపించారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏనాడూ కృషి చేయలేదన్నారు. ‘‘మోడీ ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన 12 మంది మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు దేశాన్ని పాలించగా, ఆ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఎనిమిదేళ్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ అంబేద్కర్‌కు ఆ పార్టీ భారతరత్నను ప్రదానం చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అంబేద్కర్‌కు భారతరత్న అవార్డు లభించిందన్నారు. ముద్రా రుణాల నుంచి తాగునీటి కనెక్షన్ల వరకు మోడీ ప్రభుత్వం తన సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో సముచిత వాటాను ఎలా అందించిందో వివరిస్తూ, గత ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దళిత సంఘాలు వేగంగా అభివృద్ధి చెందాయని అమిత్ షా అన్నారు.
కేంద్ర హోంమంత్రి అంతకుముందు కేరళ రాజధానిలో జరిగిన 30వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో వరుసగా దక్షిణాది రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు-లెఫ్టినెంట్ గవర్నర్‌లు పాలుపంచుకున్న సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రల సంబంధాల గురించి మాట్లాడారు. నదీజలాల భాగస్వామ్య సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణాది రాష్ట్రాలను ఈ సమావేశంలో అమిత్ షా కోరారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ తమ పెండింగ్ సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. నదీజలాల పంపకానికి సంబంధించిన సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణ జోనల్ కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు. దక్షిణాదిలోని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలలో తమిళనాడు-కర్ణాటకల మధ్య కావేరి సమస్య, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది నీటి భాగస్వామ్యంపై ఆందోళనలు ఉన్నాయి.