వేల కిలో మీటర్లు ప్రయాణించిన ఉడత.. శాశ్వత నివాసాన్ని వెతుకుతూ సముద్రయానం

By Mahesh KFirst Published Sep 3, 2022, 7:22 PM IST
Highlights

ఓ ఉడత మన దేశం నుంచి వేల కిలోమీటర్ల సముద్రయానం చేసి స్కాట్లాండ్ చేరుకుంది. భారత్ నుంచి స్కాట్లాండ్ వెళ్తున్న ఓ పడవలో ఇది కనిపించింది. దీన్ని కొందరు ఆ దేశ వాసులు జాగ్రత్తగా దగ్గరకు తీసుకున్నారు. దాని ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
 

న్యూఢిల్లీ: ఉడతలు మన దేశంలో ఏ పార్కు‌కు వెళ్లిన కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పొదలు ఉన్నా అవి కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఉడతల మరీ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, అవి మనిషి అలికిడి వినగానే పొలోమని పరుగెత్తుతాయి. పొదల్లో దాక్కుంటాయి. వాటిని మచ్చిక చేసుకోవడం అంత తేలికేం కాదు. కానీ, కొందరు వాటిని దగ్గరకు తీసుకుంటారు. అవి కూడా వారి చేతుల్లోకి వస్తూ ఉంటాయి. ఇది గొప్ప విషయంగా చెప్పుకునే వారూ ఉంటారు. ఇలాంటి ఓ ఉడత.. వేల కిలోమీటర్లు సముద్ర యానం చేసింది. అదే దానికి ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. భారత్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని యూరప్ కంట్రీ స్కాట్లాండ్‌కు చేరుకుంది. ఇప్పుడు అది దాని శాశ్వత నివాసాన్ని వెతుక్కునే పనిలో ఉన్నది.

ఈ ఉడత గురించి న్యూ ఆర్క్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్, నార్త్ ఈస్ట్ వైల్డ్ లైఫ్ అండ్ యానిమల్ రెస్క్యూ సెంటర్‌లు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాయి. అందులో పెద్ద బోనులో ఉడత కనిపిస్తున్నది. ‘నిన్న సాయంత్రం క్లారా, నటాషాల నుంచి మాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. వారు స్కాట్లాండ్‌లోని అబీర్దిన్ నగరంలో పెస్ట్ సొల్యూషన్స్‌లో పని చేస్తూ ఉంటారు. వారు వారి పనిలో భాగంగా అబీర్దిన్‌లోని ఓ పోర్టు దగ్గరకు వెళ్లుతున్నారు. ఇండియా నుంచి వస్తున్న ఓ బోట్‌లో ఈ ఉడతను (పేరు జిప్పీ అని పెట్టారు) కనుగొన్నారు. దాన్ని వారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్లుతున్నారు. ఆ ఉడతను రిసీవ్ చేసుకోవడానికి మేం ప్రిపేర్ అయి ఉంటామా? అని అడిగారు’ అని ఆ ఫేస్ బుక్ పోస్టు తెలిపింది.

‘మా కొత్త సందర్శకుడు రాగానే.. మేం అతన్ని పెద్ద బోనులోకి మార్చాం. ఆ బోనులో ఉడత కండీషన్‌ను అంచనా వేయగలం. ఇండియాలో ఎక్కువగా కనిపించే చారలు ఉన్న ఉడత అది. ఆ ఉడత చాలా ఆరోగ్యంగా ఉన్నది. యాక్టివ్‌గా ఉన్నది. వేగంగా కదలికలు ఉన్నాయి. అందుకే ఆ ఉడత పేరును జిప్పీ అని పెట్టాం’ అని వివరించారు.

ఆ ఉడత కఠినమైన ప్రయాణాన్ని తట్టుకోగలిగిందని ఆ పోస్టు పేర్కొంది. కొంత ఒత్తిడికి కూడా గురైందని వివరించింది. భారత్ నుంచి మూడు వారాలు సముద్రయానంలో గడిపి కొంత ఒత్తిడికి గురైనా.. చాలా ఆరోగ్యంగా ఉన్నదని పేర్కొంది. జిప్పీ ఇప్పుడు శాంతించిందని, మంచిగా తినడం కూడా మొదలు పెట్టిందని వివరించింది. ఆ ఉడత కోసం స్పెషలిస్టును వెతికి పట్టడం, శాశ్వత నివాసాన్ని కనుగొనడం ఇప్పుడే మొదలైందని తెలిపింది. ఆ జిప్పీని దత్తత తీసుకుంటామని నెటిజన్ల నుంచి విజ్ఞప్తులు పోటెత్తుతున్నాయి.

click me!