
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై పంజాబ్(Punjab)లో తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైన కుమార్ విశ్వాస్(Kumar Vishwas).. కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతుగానే ఉన్నాడని, ఒక వేళ ఖలిస్తానీ రాజ్యాం ఏర్పడితే.. దానికి తొలి ప్రధాని అవుతారని తనతో ఒకసారి చెప్పారని పేర్కొన్నారు. ఆ మాటలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని పార్టీలూ ఆ కామెంట్లపై రియాక్ట్ అయ్యాయి. ఈ ఆరోపణలను తాజాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ తిప్పికొట్టారు.
పంజాబ్‌లో అన్ని పార్టీలూ ఒక్కటి అయ్యాయని కేజ్రీవాల్ అన్నారు. అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకం అయ్యాయని ఆరోపించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్‌లు అందరూ ఆప్‌కు వ్యతిరేకంగా గ్రూప్‌గా ఏర్పడ్డారని అన్నారు. వారంతా ఒకటే భాష మాట్లాడుతున్నారని చెప్పారు. రాత్రికి రాత్రే వీడియో కాల్‌లో చాటింగ్ చేసినట్టు లేదా కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుకున్నట్టు ఒకటే మాట మాట్లాడుతున్నారని వివరించారు. వారంతా తనను వేర్పాటువాది అని, టెర్రరిస్టు అని అంటున్నారని, ఇది ఎంతటి హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఇది కామెడీ.. హాస్యాస్పదమైన వ్యాఖ్యలు అని కొట్టిపారేశారు.
ఒక వేళ నిజంగానే తాను టెర్రరిస్టు(Terrorist)ను అయితే.. తనపై ఎందుకు విచారణ జరిపించరని ప్రశ్నించారు. మోడీజీ ఎందుకు తనను అరెస్టు చేయించరని నిలదీశారు. నాకు తెలిసి నేను ప్రపంచంలోనే స్వీట్ టెర్రరిస్టును అని పేర్కొన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, విద్యుత్, రోడ్లు, నీటిని అందిస్తున్న స్వీట్ టెర్రరిస్టునేమో అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోని వేర్పాటు వాదులకు మద్దతులు ఇస్తున్నారని కుమార్ విశ్వాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వతంత్ర దేశానికి (ఖలీస్తాన్) ప్రధాని అవుతానని కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని చెప్పుకొచ్చారు. ‘ఒకరోజు అతను (అరవింద్ కేజ్రీవాల్) నాకు పంజాబ్ సీఎం అవుతానని లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్తాన్) మొదటి ప్రధాని అవుతానని చెప్పారు’ అని కుమార్ విశ్వాస్ తెలిపారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఎంతవరకైనా వెళ్తారని ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్.. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2018ల ఆమ్ ఆద్మీ పార్టీ కుమార్ విశ్వాస్‌ను విస్మరించి సంజయ్ సింగ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆయనకు కేజ్రీవాల్‌తో తీవ్ర విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆప్‌ను, కేజ్రీవాల్‌ను లక్ష్యంగా కుమార్ విశ్వాస్ విమర్శలు చేస్తున్నారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.