వృద్ధురాలి పెద్ద మనసు.. రూపాయికే భోజనం పెడుతూ..

By telugu news teamFirst Published Sep 11, 2020, 10:04 AM IST
Highlights

ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న కమల తన వృద్ధాప్యం గురించి ఆలోచించకుండా చెమటోడ్చి సంపాదించాలన్న లక్ష్యంతో నారాయ ణమంగళంలో ఉన్న ఓ నది కాలువ పక్కన తాటాకుల గుడిసెలో ఇడ్లీ దుకాణం నడుపుతోంది. 
 

పేదల కడుపు నింపడానికి ఓ వృద్ధురాలు ముందుకు వచ్చింది. కేవలం రూపాయికే ఇడ్లీ, దోసెలు విక్రయిస్తూ.. ఆమె పేదల ఆకలి తీరుస్తోంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరు వారూర్‌ సమీపంలోని నారాయణ మంగళం గ్రామానికి చెందిన కమల (80) అనే వృద్ధురాలు ఆ ప్రాంతంలో ఒక రూపాయికే ఇడ్లీ, దోసెను అమ్ముతోంది. కొన్నేళ్ళకు ముందు ఆమె భర్త మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా, అందరికీ వివాహమై వేర్వేరుగా కాపురం చేసుకుంటున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న కమల తన వృద్ధాప్యం గురించి ఆలోచించకుండా చెమటోడ్చి సంపాదించాలన్న లక్ష్యంతో నారాయ ణమంగళంలో ఉన్న ఓ నది కాలువ పక్కన తాటాకుల గుడిసెలో ఇడ్లీ దుకాణం నడుపుతోంది. 

ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆమె తయారుచేసిన ఇడ్లీ, దోసెలు తినేందుకు స్థానికులు బారులుతీరుతున్నారు.. రూపాయి ఇడ్లీ, దోసెకు రెండు రకాల చట్నీ, సాంబారు, ఇడ్లీ పొడి అందిస్తుంది. ఈ సేవలను ఆమె గత 50 ఏళ్లుగా కొనసాగిస్తూ వేలాది మంది పేదల ఆకలి తీరుస్తోంది. దీనిపై కమల మాట్లాడుతూ, రోజువారీ కూలీపనులు చేసుకుంటున్న వారిని దృష్టిలో ఉంచుకొని తాను రూపాయికే ఇడ్లీ, దోసె విక్రయిస్తున్నానని తెలిపింది.  కుటుంబీకులంతా దూరమైన నేపథ్యంలో, తన వద్దకు వచ్చే వారిని కన్నబిడ్డల్లా చూసుకోగలుగుతున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

click me!