ఆయన బతికున్నప్పుడు చూడలేదు.. శవాన్ని మాత్రమే చూశా: వీరప్పన్ కుమార్తె భావోద్వేగం

By Siva KodatiFirst Published Jul 21, 2020, 2:47 PM IST
Highlights

చిన్నప్పటి నుంచి తాను తన తండ్రిని చూడలేదని, కేవలం ఆయన చనిపోయాక మృతదేహాన్ని మాత్రమే కాసేపు చూశానన్నారు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి

చిన్నప్పటి నుంచి తాను తన తండ్రిని చూడలేదని, కేవలం ఆయన చనిపోయాక మృతదేహాన్ని మాత్రమే కాసేపు చూశానన్నారు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి.

ఇటీవల ఆమెను తమిళనాడు బీజేపీ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యారాణి సోమవారం మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని.. తాను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పారు.

తన జీవితంలో చేదు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని విద్య ఆవేదన వ్యక్తం చచేశారు. సమాజం తనను శత్రువుగానో, ప్రత్యర్థిగానో చూడలేదని... మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తన చదువు, చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుల భోదనలు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని విద్యారాణి చెప్పారు. తన తండ్రిని చూడనప్పటికీ.. ఆయన గురించి కొందరు మంచితనంతో ఎన్నో మాటలు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

జీవచ్ఛవంగా ఉన్న తన తండ్రిని ఏదో ఆందోళన, ఉరుకులు పరుగులుగా చూసినట్లు విద్య ఉద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా వృత్తిరీత్య న్యాయవాది అయిన విద్య ఫిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్న కమలనాథులు... విద్యకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టారు. 
 

click me!