
కర్ణాటక : Karnataka కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి తెరలేపారు. రాష్ట్రంలో బీఫ్ నిషేధంపై మాట్లాడుతూ తాను హిందువునని, తాను ఇప్పటి వరకు గోమాంసం తినలేదని, తినాలనుకుంటే ఇప్పుడే తింటానని చెప్పి వివాదం రేపారు. మతాల మధ్య ఆర్ఎస్ఎస్ అడ్డుగోడలు నిర్మిస్తోందని ఆరోపించారు.
వివరాల్లోకి వెడితే.. తుమకూరు జిల్లాలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని ఆరోపించారు. “నేను హిందువుని. నేను ఇప్పటివరకు గొడ్డు మాంసం తినలేదు, కానీ నేను తినాలనుకుంటే తింటాను. నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు?" అని తుమకూరులో జరిగిన కార్యక్రమంలో సిద్ధరామయ్య ఘాటుగా ప్రశ్నించారు.
"గొడ్డు మాంసం తినేవాళ్ళు కేవలం ఒక వర్గానికి చెందినవారు కాదు, హిందువులు కూడా గొడ్డు మాంసం తింటారు, క్రైస్తవులు కూడా తింటారు. ఒకసారి నేను కర్నాటక అసెంబ్లీలో కూడా ఇదే మాట చెప్పాను. బీఫ్ తినకూడదని నాకు చెప్పడానికి మీరెవరు?" అని సిద్ధరామయ్య అన్నారు.
కర్నాటక బీఫ్ బ్యాన్ చట్టం
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం, జనవరి 2021లో, కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్, 2020ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం అన్ని రకాల పశువులను కొనడం, విక్రయించడం, రవాణా చేయడం, వధించడం, వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. ఇందులో ఆవులు, ఎద్దులు, గేదెలు ఉన్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పట్టుబడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
‘తోటి మనుషులలో తేడాలు సృష్టించడం’
ఆర్‌ఎస్‌ఎస్‌ను దుయ్యబడుతూ, మతాల మధ్య అడ్డంకులు నిర్మిస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య, “వారు (ఆర్‌ఎస్‌ఎస్) తోటి మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. తాను గొడ్డు మాంసం తినాలనుకుంటే తింటానని చెప్పిన సిద్ధరామయ్య, “ఇది ఆహారపు అలవాటు, అది నా హక్కు. గొడ్డు మాంసం ముస్లింలు మాత్రమే తింటారా? అని ప్రశ్నించారు.