గత ఐదేండ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?

By Rajesh KarampooriFirst Published Dec 9, 2022, 5:23 PM IST
Highlights

గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 36సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి ఖర్చు చేశారు. ఇందుకోసం రూ.239 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం రాజ్యసభకు తెలియజేశాడు.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ పర్యటనల్లో భాగంగా ఇతర దేశాలతో పలు వాణిజ్య ఒప్పందాలు,  విదేశీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం, ఇతర దేశాలతో పరస్పర సంబంధాలను బలోపేతానికి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా దీనికి సంబంధించిన కీలక సమాచారం తెరపైకి వచ్చింది. అందులో ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు అయ్యే ఖర్చుల వివరాలన్నీ ఉన్నాయి. అంటే ప్రధాని ప్రతి పర్యటనకు ఎంత ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో వెల్లడించారు.

యూరప్ టూర్ కోసం 2.25 కోట్లు

ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలకు వెళ్లారని, అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల, ప్రధాని మోదీ బాలి పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆ పర్యటన కోసం 32 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. ఇది కాకుండా.. ప్రధానమంత్రి 2022 ప్రారంభంలో యూరప్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు.

అమెరికా పర్యటనకు అత్యంత ఖర్చు 

ప్రధాని అమెరికా పర్యటన అత్యంత ఖరీదైనదని ఆయన అన్నారు. 2019 సెప్టెంబర్ 21 నుండి 28 వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారనీ, ఈ పర్యటన మొత్తం ఖర్చు రూ.23.27 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఆయన పర్యటనలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా 9 మంది ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 26-28 మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటించారనీ, ఈ పర్యటక కోసం రూ. 23,86,536 ఖర్చు చేసినట్లు మంత్రి రాజ్యసభలో తెలిపారు.

ఇటీవల జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్లారు. ఈ పర్యటనకోసం ప్రభుత్వం రూ. 32,09,760 ఖర్చు చేసిందని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని యూరప్ పర్యటన చేసినట్టు తెలిపారు. ఇందుకోసం రూ. 2,15,61,304 ఖర్చయిందని మురళీధరన్ రాజ్య సభలో తెలియజేశారు. అదే సమయంలో కరోనా కారణంగా..15 నవంబర్ 2019 నుండి 26 మార్చి 2021 వరకు ప్రధాని మోడీ ఎటువంటి విదేశీ పర్యటనలు చేయలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి చెప్పారు. 

click me!