30 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు టైరు పంక్చర్ కావడంతో దానిని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అయితే ఆ బస్సును ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి.
ఆగి ఉన్న బస్సును ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలోని గోరఖ్ పూర్-కుషినగర్ హైవేపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. 30 మంది ప్రయాణికులతో ఓ బస్సు గోరఖ్ పూర్ నుంచి పద్రౌనాకు గురువారం బయలుదేరింది. ఆ బస్సు గోరఖ్ పూర్-కుషినగర్ ప్రయాణిస్తోంది. అయితే జగదీష్ పూర్ లోని మల్లాపూర్ సమీపంలోకి చేరుకోగానే ఓ టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్, కండక్టర్ ఆ బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అప్పటికీ చీకటి పడటంతో వారంతా మరో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.
బస్సు ఆగి ఉండటంతో పలువురు ప్రయాణికులు కిందికి దిగారు. మరి కొందరు బస్సులో ఉన్నారు. అదే సమయంలో వెనకాల నుంచి ఓ ట్రక్కు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టిన దాటికి బస్సు చక్రాలు పైకి రావడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయాలు అయ్యాయి. వారిలో దాదాపు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం.
అయితే క్షతగాత్రులను హాస్సిటల్ కు తీసుకెళ్లే సరికే మరో నలుగురి పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈ ఘటన పై సమాచారం అందిన వెంటనే అధికారులు జిల్లా, మెడికల్ కాలేజీ డాక్టర్లను అలెర్ట్ చేశారు. క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ కు వస్తుండటంతో రాత్రి సమయంలో డాక్టర్లు హాస్పిటల్ కు వచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఐదు అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను సదర్ ఆస్పత్రికి, మెడికల్ కాలేజీకి తరలించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతులందరి వివరాలు ఇంకా తెలియరాలేదు. వీరిలో శైలేష్ పటేల్ (25), సురేష్ చౌహాన్ (35), నీతేష్ సింగ్ (25), హిమాన్షు యాదవ్ (24) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.