పరువు హత్య: యువతిని చంపేసిన తండ్రి, అన్న

By pratap reddyFirst Published Sep 13, 2018, 10:55 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్ జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. తండ్రి, సోదరుడు కలిసి ఓ యువతిని గొంతు నులిమి చంపేశారు. మరో మతానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే కోపంతో వారు ఆ పనికి ఒడిగట్టారు. 

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్ జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. తండ్రి, సోదరుడు కలిసి ఓ యువతిని గొంతు నులిమి చంపేశారు. మరో మతానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే కోపంతో వారు ఆ పనికి ఒడిగట్టారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారికి కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

అమ్మాయి కుటుంబం బీహార్ లోని ముజఫర్పూర్ కి చెందింది. 19 ఏళ్ల యువతి జహానా ఖటూన్ ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి రెండు సార్లు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, ఆ రెండు సార్లు కూడా వారిని పట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చారు.

యువతిని కోల్ కతాలోని తన తండ్రి మొహమ్మద్ ముస్తాక్ అలియాస్ ముస్తఫా, ఆమె అన్న మొహమ్మద్ జహీద్ ఇంటికి తీసుకుని వచ్చారు. ఆగస్టు 31వ తేదీన తండ్రికొడుకులు జహానాను తీసుకుని బుర్ద్వాన్ వైపు వెళ్లారు. 

మార్గమధ్యంలో తండ్రి కూతురి గొంతు నులిమాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకోవడానికి తర్వాత రాయితో ఆమె తలపై కొట్టాడు. శవాన్ని ఇద్దరు కలిసి నబగ్రామ్ లోని రోడ్డు పక్కన పడేశారు. మర్నాడు పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఆమె శరీరంపై రాసి ఉన్న రెండు ఫోన్ నెంబర్లను పోలీసులు తీసుకున్నారు. ఆ రెండు ఫోన్ నెంబర్లలో ఒకటి ఆమెను ప్రేమించిన యువకుడిది.  అతను మహారాష్ట్రలోని ముంబైలో పనిచేస్తున్నాడు. పోలీసులు ముంబై వెళ్లి మృతురాలి ఫొటోను అతనికి చూపించారు. 

ఆమె జహానా అయి ఉంటుందని చెప్పి అతను బోరున విలపించాడు. జహానా కుటుంబానికి సంబంధించిన వివరాలను అతను చెప్పాడు. తండ్రీకొడుకులు ఆమెను కోల్ కతాకు తీసుకుని వెళ్లారని, వారే ఆమెను చంపి ఉంటారని అతను చెప్పాడు. 

అతని సాయంతో నిందితులిద్దరినీ పోలీసులు గుర్తించారు. వారిని విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. యువకుడితో తమ జహానా సంబంధం పెట్టుకోవడం వల్ల గ్రామంలో తమ పరువు పోయిందని, అందువల్లనే చంపామని చెప్పారు. 

click me!