న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఈ రోజు అసదుద్దీన్ ఒవైసీకి(AIMIM Chief Asaduddin Owaisi) అరుదైన విజ్ఞప్తి చేశారు. ఆయనకు అందించే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ(Z Security)ని స్వీకరించాలని కోరారు. అసదుద్దీన్ ఒవైసీ హాపూర్ జిల్లాలకు వెళ్లడం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం కాదని ఆయన పార్లమెంటు(Parliament)లో మాట్లాడుతూ తెలిపారు. జిల్లా కంట్రోల్ రూమ్‌కు హాపూర్ వెళ్లడంపై సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇద్దరు దుండగులు ఆయన కార్ల కాన్వాయ్‌పై కాల్పులు జరిపారని వివరించారు. ఆ ఘటన నుంచి ఆయన సురక్షితంగా బయటపడగలిగారని తెలిపారు. అనంతరం ఆయన సురక్షితంగా ఆయన ఢిల్లీ చేరుకున్నారని చెప్పారు. కానీ, ఆయన వాహనానికి మూడు బుల్లెట్ల గాయాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనను ముగ్గురు సాక్షులు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము రిపోర్ట్ తీసుకున్నామని అన్నారు. గతంలో కేంద్ర సెక్యూరిటీ ఏజెన్సీల సంకేతాలను చూస్తే.. ఒవైసీకి ఇంకా ముప్పు ఉన్నదని తెలిపారు. అందుకే ఆయనకు జెడ్ సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని వివరించారు. కానీ, ఆయన తిరస్కృత వైఖరి కారణంగానే ఆయనకు జెడ్ సెక్యూరిటీ ఇవ్వడంలో ఢిల్లీ, తెలంగాణ పోలీసుల ప్రయత్నం సఫలం కాలేదని చెప్పారు.
ఈ నెల 3వ తేదీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన హాపూర్ వెళ్లారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆయన హాపూర్ నుంచి వెళ్లిపోతుండగా ఇద్దరు దుండగులు అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హాపూర్ కోర్టులో వీరిద్దరిని హాజరు పరిచి కస్టడీలోకి తీసుకోవడానికి న్యాయస్థానాన్ని కోరుతామని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే, ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నదని వివరించారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు సచిన్, శుభమ్‌లను అరెస్టు చేశారు. వీరిద్దరి గురించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీరిద్దరికీ గతంలో నేరచరిత్ర ఏమీ లేదు. కానీ, ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఇందులో ఒకరు సోషల్ మీడియాలో ద్వేషపు పోస్టులు పెట్టినట్టు సమాచారం.
అసదుద్దీన్ కారుపై దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో.. ఆయనకు భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ భద్రతపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్‌తో జెడ్ కేటగిరి భద్రతా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటులో మాట్లాడారు. బ్యాలెట్‌పై నమ్మకం లేకుండా .. బుల్లెట్‌పై నమ్మకం పెట్టుకుని తన కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన వారు ఎవరంటూ లోక్‌సభలో ప్రశ్నించారు మజ్లీస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాను చావుకు భయపడటం లేదని.. తనకు ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదన్నారు. సామాన్య పౌరుడిలా ఏ కేటగిరీలో వుంటానని.. కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. సోమవారం లోక్‌సభలో అమిత్ షా దీనిపై ప్రకటన చేస్తారని పీయూష్ గోయల్ వెల్లడించారు. అదే విధంగా ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడారు.