
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత వీరభద్రసింగ్ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. గురువారం తెల్లవారు జామను 4 గంటల 40 నిమిషాలకు ఆయన కన్నుమూశారు.
దీర్షకాలికంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రెండు నెలలుగా ఆయన ఆస్పత్రిలి చికిత్స పొందుతున్నారు. రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు కూడా.
కొద్ది రోజులుగా ఆయన శ్వాస సంబంధితమైన సమస్యలతో బాధపడుతున్నారు. వెంటలేటర్ మీద చికిత్స పొందారు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోలన్ జిల్లాలోని ఆర్కీ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వీరభద్ర సింగ్ తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదు సార్లు ఎంపీగా ఉన్నారు. వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా రాజకీయ నేతలే. ప్రతిభ మాజీ ఎంపీ కాగా, విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.