
Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ గవర్నర్ హిజాబ్ పై చేసిన వ్యాఖ్యల క్రమంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు వీడీ సతీశణ్ స్పందిస్తూ.. గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కర్నాటకలో హిజాబ్ వివాదం కారణంగా మూతపడిన ప్రీ-యూనివర్శిటీ, డిగ్రీ కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. తరగతి గదిలో విద్యార్థులు కాషాయ కండువాలు, హిజాబ్ సహా మతపరమైన వాటిని ధరించరాదని హైకోర్టు గత వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత తరగతులను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనిఫాం సంబంధిత నిబంధనలు ఎక్కడ ఉన్నా (కళాశాలల్లో) కచ్చితంగా పాటించాలనీ, యూనిఫాం లేని చోట డ్రెస్‌కోడ్‌ను నిర్ణయిస్తామని, హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రం కావడం మరియు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారడంతో, ఫిబ్రవరి 9 నుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ లో మహిళలు వేసుకునే దుస్తుల విషయంలో హిజాబ్ అనే పదాన్ని వాడలేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సోమవారం ఆయన ‘ఏసియానెట్ న్యూస్’ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గంలోని ఓ కేటగిరీ.. అమ్మాయిలను విద్యకు దూరం చేయాలనే కుట్ర ఇందులో దాగి ఉన్నదని పేర్కొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ కు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కేరళ ప్రతిపక్ష పార్టీలు గవర్నర్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడైన వీడీ.సతీశణ్ మట్లాడుతూ.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బీజేపీ అధికార ప్రతినిధి (హిజాబ్ రోపై) లాగా మాట్లాడుతున్నారు. భారతదేశంలోని కొంతమంది గవర్నర్లు అలా మాట్లాడుతున్నారు అని అన్నారు.
ఇదిలావుండగా, కర్నాటకలోని విజయపురలోని కాలేజీలోకి హిజాబ్ ధరించిన పలువురు అమ్మాయిలను ప్రాంగణంలోకి అనుమతించలేదు. కాలేజీ లోపలికి వచ్చే ముందు వారిని కాలేజీ యాజమాన్యం హిజాబ్ లను తీసివేసి రావాలని పేర్కొంది. తాము హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపింది. అయితే, పలువురు అమ్మాయిలు హిజాబ్ తీసివేయడానికి నిరాకరించారు.