
Hijab row: కర్ణాటకతో పాటు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేసిన హిజాబ్ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో తీర్పు ఎలా ఉన్నా.. రాజధాని బెంగుళూర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తును రంగంలోకి దించింది. ఇప్పటికే పలు అంక్షలు అమల్లోకి వచ్చేశాయి. అలాగే ఉడిపితోపాటు దక్షిణ కన్నడ జిల్లావ్యాప్తంగా మంగళవారం అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగే పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాలని కలెక్టర్ అన్ని విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో బెంగళూర్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15 నుంచి ఈ నెల 21 వరకు నగరంలో నిషేధాజ్ఞలను అమలు లో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో వారం పాటు బెంగళూరు నగరంలో ఎలాంటి సమావేశాలు గానీ, నిరసనలు గానీ నిర్వహించకుండా.. కఠిన చర్యలు తీసుకోనున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఉడిపికి చెందిన పలువురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే వాదనలు విన్నది. హిజాబ్ అంశంపై కర్ణాటకలో దుమారం రేగిన విషయం తెలిసిందే. హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
.
గత రెండునెలల క్రితం.. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినిలు హిజాబ్ ధరించినందుకు కాలేజీలోకి ప్రవేశం నిరాకరించారంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. ఈక్రమంలో ఈ వ్యవహారం కర్ణాటక హైకోర్టు మెట్లెక్కేసింది.
అదే సమయంలో సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు అయ్యింది. ప్రస్తుతం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ సాగిస్తున్నందున అక్కడకే వెళ్లాలని, హైకోర్టు ఇచ్చే తీర్పుపై అభ్యంతరం ఉంటే అప్పుడు తమను ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీం ఆదేశాలతో కర్ణాటక హైకోర్టు వ్యవహరిస్తుంది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే వాదనలు విన్నది. దీంతో నేడు కర్ణాటక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.