Hijab row back in Karnataka: మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చిన‌ హిజాబ్ వివాదం.. మంగళూరు యూనివర్శిటీలో నిర‌స‌న‌లు

By Rajesh KFirst Published May 27, 2022, 6:07 AM IST
Highlights

Hijab row back in Karnataka: మంగళూరు యూనివర్శిటీలో ముస్లిం విద్యార్థినీలు హిజాబ్ ధరించి త‌ర‌గ‌తుల‌కు రావ‌డాన్ని వ్యతిరేకిస్తూ.. హిందూ విద్యార్థులు తరగతిని బహిష్కరించారు. యూనివర్సిటీ క్యాంపస్ ముందు నిరసన ప్రారంభించారు. సమస్య పరిష్కారమైతే తప్ప తాము ఏ తరగతులకు హాజరు కాబోమని విద్యార్థులు చెప్పారు.
 

Hijab row back in Karnataka: కర్నాటకలో హిజాబ్ వివాదం ముగిసింద‌ని భావిస్తున్న స‌మ‌యంలో మళ్లీ రచ్చ మొదలైంది. గతంలో ఉడిపి జిల్లాలో ప్రారంభ‌మైన  ఈ వివాదం.. ప‌లు ప‌రిణామాల త‌రువాత స‌ర్దుమ‌నిగింది. తాజాగా మంగళూరు కేంద్రంగా మ‌ళ్లీ మొద‌లైంది. మంగళూరు యూనివర్శిటీలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి క్లాస్‌కు హాజర‌య్యారు. దీన్ని నిరసిస్తూ.. ఆందోళ‌న‌కు దిగారు హిందూ విద్యార్థులు. తాము కూడా కాషాయ వస్త్రాలు, కాషాయ సఫా ధరించి క్లాస్‌కు హాజరవుతామని ప్రకటించారు.

కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం ఇప్ప‌ట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా.. ముస్లిం యువతులు అందుకు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నిషేధం ఉన్నప్పటికీ,  ముస్లీం విద్యార్థినీలు మరోసారి హిజాబ్ ధరించి మంగళూరు విశ్వవిద్యాలయానికి రావడం ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం హిందూ విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసన తెలిపారు.

కర్ణాటక హైకోర్టు తీర్పు తర్వాత కూడా ముస్లిం యువతులు హిజాబ్ ధరించి కాలేజీకి వస్తున్నారని, కాలేజీ యాజమాన్యం అభ్యంతరం చెప్పడం లేదని హిందూ విద్యార్థులు ఆరోపించారు. నిరసన సందర్భంగా, మంగళూరు విశ్వవిద్యాలయంలోని హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో కోర్టు ఆదేశాలను పాటించకపోతే, తాము కూడా కాషాయం ధరించి కళాశాలకు రావడం ప్రారంభిస్తామని హెచ్చరించారు. కర్ణాటక హైకోర్టు హిజాబ్ నిషేధ ఉత్తర్వులను అమలు చేయనందుకు యూనివర్సిటీ అధికారులను, ముస్లిం విద్యార్థినులను సస్పెండ్ చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. 

హిజాబ్‌పై నిరసన తెలుపుతున్న యూనివర్శిటీ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కోర్టు ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా.. వారు మాత్రం హిజాబ్ ధరిస్తూనే ఉన్నారు.. మా కాలేజీలో మాత్రం ఆ నిబంధన అమలు చేయడం లేదు.. అధికారులు.. తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి పిలిచారు  హిజాబ్ ధరించవద్దని వారికి తెలియజేశారు. కానీ, ఎటువంటి నియమాన్ని పాటించలేదు. అని తెలిపారు.

హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థులందరినీ సస్పెండ్ చేయాలన్నదే త‌మ‌ డిమాండ్ అని. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విద్యార్థి సంఘం నాయకుడిని తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని హిందూ విద్యార్థి సంఘం కోరింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో యూనివర్శిటీ గురువారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది, క్యాంపస్‌లో ఎటువంటి మతపరమైన దుస్తులను ఉపయోగించడం అనుమతించబడదని పునరుద్ఘాటించింది.   
 
ఈ క్రమంలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించిన విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు లేఖ కూడా రాశారు. అయితే, వారికి అనుమతి నిరాకరించారు.  డిప్యూటీ కమిషనర్‌ను ఆశ్రయించాలని కోరారు. ప్రస్తుతానికి, ముస్లిం విద్యార్థినీ విద్యార్థులు తమ సమస్యలను లేఖ ద్వారా డిప్యూటీ కమిషనర్‌ను సంప్రదించారు. ఈ విషయంలో తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు. తద్వారా తాము చదువును తిరిగి ప్రారంభించవచ్చని అభ్య‌ర్థించారు. 

మార్చిలో.. చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి నేతృత్వంలోని జస్టిస్ జెఎం ఖాజీ,  కృష్ణ దీక్షిత్‌లతో కూడిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం హిజాబ్ ధరించడం అవసరం లేదని, ప్రభుత్వ ఉత్తర్వులను చెల్లుబాటు చేయని బలవంతపు కేసును నమోదు చేయలేదని తీర్పునిచ్చింది. 

click me!