karnataka hijab row: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు.. హైకోర్టులో కర్ణాటక సర్కార్ వాదనలు

Siva Kodati |  
Published : Feb 18, 2022, 07:01 PM IST
karnataka hijab row: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు.. హైకోర్టులో కర్ణాటక సర్కార్ వాదనలు

సారాంశం

హిజాబ్ వివాదంపై  కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అశ్వస్థీ (justice rituraj awasthi) నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ముందు కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాడ్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇస్లాం సంప్రదాయంలో హిజాబ్ తప్పనిసరికాదని, దీనిని నిషేధించడం రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను ఉల్లంఘించడం కాదని ప్రభులింగ్ వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో (karnataka) రాజుకున్న హిజాబ్ వివాదం (hijab) ఇప్పడు దేశ సమస్యగా మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవహారం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. హిజాబ్ వివాదంపై వరుసగా ఆరో రోజు కర్ణాటక హైకోర్టు (karnataka high court) విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అశ్వస్థీ (justice rituraj awasthi) నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ముందు కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాడ్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇస్లాం సంప్రదాయంలో హిజాబ్ తప్పనిసరికాదని, దీనిని నిషేధించడం రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను ఉల్లంఘించడం కాదని ప్రభులింగ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఆయన సమర్ధించారు. 

సమగ్రత, నమానత్వం, ప్రజాక్రమానికి భంగం కలిగించే వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఫిబ్రవరి 5న జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధం కాదని ప్రభులింగ్ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో హిజాబ్ సమస్య లేదని.. ఆ ఉత్తర్వులు ఏమాత్రం హానికరం కాదని  ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తరగతి గదిలోకి హిజాబ్‌తో అనుమతించాలా? వద్దా? అని విద్యాసంస్థలు నిర్ణయించుకోవచ్చు అని ఏజీ వాదించారు. 

మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదని, లౌకికవాదం, ప్రజా సమగ్రతకు విరుద్ధమైన హిజాబ్‌ను అనుమతించరాదనేది ప్రభుత్వ వైఖరి ప్రభులింగ్ తేల్చిచెప్పారు. ఇదే సమయంలో హిజాబ్ అంశంపై ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించేలా ఉన్నాయన్న పిటిషినర్ల వాదనలను ఏజీ తోసిపుచ్చారు. మరోవైపు, ప్రజలు ప్రతిరోజూ ధరించే దుపట్టాలు, గాజులు, తలపాగాలు, శిలువలు, బొట్టు వరకూ వందలాది మతపరమైన చిహ్నాలు ఉన్నప్పుడు హిజాబ్‌ను ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారని పిటిషనర్ తరఫున వాదించిన లాయర్లు.. న్యాయమూర్తులను ప్రశ్నించారు.

కాగా.. హిజాబ్, కేసరి శాలువాల వివాదం నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
రాష్ట్రంలోని ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చాలా కళాశాలలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. హిజాబ్‌కు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు.  
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?