
Karnataka Hijab Row: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం (Hijab Row) నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. గత నెలలో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినిలు హిజాబ్ ధరించినందుకు కాలేజీలోకి ప్రవేశం నిరాకరించారంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ వివాదం
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. ఈ తరుణంలో రాజకీయ, సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలు, రచయితలు తమదైన శైలిలో స్పందిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు.
తాజాగా.. వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్( Taslima Nasreen) ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హిజాబ్ వివాదం (Hijab Row) గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ లు ముస్లీం మహిళల అణచివేతకు చిహ్నాలు అని తస్లీమా పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో .. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ ప్రతిపాదన గురించి తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ.. "విద్యా హక్కు మతానికి సంబంధించిన హక్కు అని నేను నమ్ముతున్నాను" అని అన్నారు. “కొంతమంది ముస్లింలు హిజాబ్ తప్పనిసరి అని అనుకుంటారు, కొందరు హిజాబ్ అవసరం లేదని అనుకుంటారు. కానీ, హిజాబ్‌ను 7వ శతాబ్దంలో కొంతమంది స్త్రీద్వేషులు పరిచయం చేశారు. ఎందుకంటే ఆ సమయంలో స్త్రీలను లైంగిక వస్తువులుగా పరిగణించేవారు. పురుషులు స్త్రీలను చూస్తే, పురుషులకు లైంగిక కోరిక కలుగుతుందని వారు నమ్ముతారు. కాబట్టి మహిళలు హిజాబ్ లేదా బురఖా ధరించాలి. వారు పురుషుల నుండి తమను తాము దాచుకోవాలి” అని బంగ్లాదేశ్ రచయిత అన్నారు.
ఆధునిక సమాజంలో.. 21వ శతాబ్దంలో.. స్త్రీలు పురుషులతో సమానమని, ఈ ఆధునిక సమాజంలో హిజాబ్, నిఖాబ్ లేదా బురఖా అవసరమా అని ప్రశ్నించారు. ఇవి అణచివేతకు చిహ్నాలని, బురఖా స్త్రీలను కేవలం జననేంద్రియ అవయవాలకు మాత్రమే పరిమితం చేస్తుందని భావిస్తున్నానని అన్నారు. అలా అయితే.. హిజాబ్ లేదా నికాబ్ లేదా బుర్ఖా మహిళలతో పాటు పురుషులకు కూడా అవమానకరమని తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు.మతం కంటే విద్యే ముఖ్యమని, లౌకిక సమాజంలో సెక్యులర్ డ్రెస్ కోడ్ ఉండాలని ఆమె ఉద్ఘాటించారు.
లౌకిక రాజ్యంలో పాఠశాలలు,కళాశాలల్లో సెక్యులర్ డ్రెస్ కోడ్ ఉండాలనీ, ఎందుకంటే మతం కంటే విద్య ముఖ్యమనీ, ప్రజలు మత విశ్వాసాలను కలిగి ఉండవచ్చు కానీ, వారు ఇంట్లో లేదా మరెక్కడైనా వాటిని ఆచరించవచ్చు, కానీ లౌకిక సంస్థలో కాదని తస్లీమా నస్రీన్ అన్నారు. ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వారి మతపరమైన గుర్తింపుగా ఉండకూడదని తస్లీమా నస్రీన్ వివరించారు. సెక్యులరిజం అంటే రాజ్యాన్ని మతం నుండి వేరు చేయాలి, చట్టం సమానత్వంపై ఆధారపడి ఉండాలి. కానీ, మతంపై కాదని తస్లీమా నస్రీన్ వివరించారు.