తమిళనాడును వీడని వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

By Sumanth KanukulaFirst Published Nov 13, 2022, 9:48 AM IST
Highlights

తమిళనాడును భారీ వర్షాలు వీడటం లేదు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తోంది. 

తమిళనాడును భారీ వర్షాలు వీడటం లేదు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తోంది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రోజున కూడా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో డ్యామ్‌లు నీటితో నిండిపోయాయి. పలు డ్యామ్‌లకు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. వరదల నేపథ్యంలో కోయంబత్తూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయంలోనే ఉండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని.. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

తిరువళ్లూరు, రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, కళ్లకురిచ్చి, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, తేని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా, మత్స్యకారులను దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలు, వాటిని ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వెంబడి వెళ్లవద్దని వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరించింది.

ఇక, నవంబర్ 13 - 14 తేదీలలో కేరళ, మహేలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లక్షద్వీప్, మాల్దీవులు-కొమోరిన్ ప్రాంతం, కేరళ తీరం వెంబడి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా గాలి వేగం గంటకు 40-45 కి.మీ. నుంచి 55 కి.మీ వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

click me!