జవాన్లు రిలాక్స్ అయ్యేందుకు... 30 ఏళ్ల తర్వాత

By Siva KodatiFirst Published Mar 8, 2019, 12:16 PM IST
Highlights

సరిహద్దుల్లో కాపలా, ఉగ్రవాదుల ఏరివేతతో నిత్యం తలమునకలై ఉంటున్నారు భారత జవాన్లు. ఈ క్రమంలో వారు సేద తీరేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సరిహద్దుల్లో కాపలా, ఉగ్రవాదుల ఏరివేతతో నిత్యం తలమునకలై ఉంటున్నారు భారత జవాన్లు. ఈ క్రమంలో వారు సేద తీరేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 30 ఏళ్ల క్రితం మూతబడిన హెవెన్ థియేటర్‌ తిరిగి తెరచుకుంది.

పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ థియేటర్ ఉంది. పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత అక్కడ సైన్యం మోహరింపులు భారీగా పెరిగిపోయాయి.

ఈ క్రమంలో సైనికులు సేద తీరేందుకు ఈ థియేటర్‌ను ఉపయోగంలోకి తెచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాత్రిపగలు తేడా లేకుండా విధుల్లో మునిగిపోయే జవాన్లు ఈ హెవెన్‌లో కాసేపు సేద తీరుతారన్నారు.

యుద్ధం నేపథ్యంలో సాగే ‘పల్టాన్’ లాంటి సినిమాలు మరింత ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. కన్నవారు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులకు దూరంగా ఉంటున్న జవాన్లకు డైరెక్టర్ జేపీ దత్తా సినిమాలు కాస్త ఉత్సాహాన్నిస్తాయన్నారు.

స్థానికులతో పాటు సినిమా చూడటం కూడా కొత్త అనుభూతినిస్తుందన్నారు. చివరిసారిగా 1991లో అమితాబ్ నటించిన కాళియాను హెవెన్ థియేటర్‌లో ప్రదర్శించారు. 
 

click me!