ఆఫర్లు ఉన్నాయి.. పొలిటికల్ ఇన్నింగ్స్‌‌పై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ ఫిక్స్ అయినట్టేనా..!

Published : Dec 25, 2021, 04:56 PM IST
ఆఫర్లు ఉన్నాయి.. పొలిటికల్ ఇన్నింగ్స్‌‌పై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ ఫిక్స్ అయినట్టేనా..!

సారాంశం

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) రాజకీయాలకు సంబంధించి తనకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు (Have offers from parties) వస్తున్నాయని శనివారం వెల్లడించారు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్దమయ్యారనే సంకేతాలు వెలువడుతున్నాయి. నిన్న అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్.. రాజకీయాలకు సంబంధించి తనకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు (Have offers from parties) వస్తున్నాయని శనివారం వెల్లడించారు. నేడు తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడిన భజ్జీ.. రాజకీయాలపై కూడా స్పందించారు. అయితే భవిష్యత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భజ్జీ వెల్లించారు. రాజకీయాల విషయానికి వస్తే.. అది జరిగినప్పుడు అందరికి తెలియజేస్తానని చెప్పారు. 

‘నిజం చెప్పాలంటే.. నేను రాజకీయాల గురించి ఆలోచించలేదు. నాకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయి. కానీ నేను చాలా తెలివిగా ఆలోచించాలి. ఇది చిన్న నిర్ణయం కాదు. నేను దీనిని సగం సగం చేయాలని అనుకోవడం లేదు. నేను పూర్తిగా సిద్దంగా ఉన్నానని అనుకున్న రోజు.. రాజకీయాల్లోకి వెళ్తాను’ అని భజ్జీ పేర్కొన్నారు. 

ఇక, హర్భజన్ సింగ్ రాజకీయాల్లో రాబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భజ్జీ సొంత రాష్ట్రమైన Punjabలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అతడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. అయితే 10 రోజుల కింద హర్భజన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భజ్జీ పొలిటికల్ ఎంట్రీ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. 

అయితే సిద్దూతో ఫొటో గురించి అడిగిన ప్రశ్నలకు భజ్జీ సమాధానమిస్తూ.. ‘ఇది సాధారణ సమావేశం. ఎన్నికలు దగ్గరపడ్డాయి అందుకే జనాలు ఊహాగానాలు చేస్తున్నారని నాకు అర్థమైంది. కానీ ఏమీ లేదు. నేను రాజకీయాల్లోకి వస్తే, అందరికీ తెలియజేస్తాను’ అని పేర్కొన్నారు. 

ఇక, 2022లో పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లో అధికారం పోకుండా కాపాడుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇటీవల ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తుంది. 

ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు యువరాజు సింగ్, హర్భజన్ సింగ్‌లు రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. పోటీకి నిలబడితే భారీ ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచి భజ్జీ.. రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు కొద్ది నెలల క్రితం యువరాజు, భజ్జీలు బీజేపీలో చేరనున్నట్టుగా ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. 

 

కాంగ్రెస్‌లోకి భజ్జీ..!
నవజ్యోత్ సింగ్ సిద్దూతో భేటీ జరిగిన 10 రోజులకే భజ్జీ.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం చూస్తుంటే పొలిటికట్ ఎంట్రీకి అంతా సిద్దమైనట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సిద్దూతో భేటీలో పలు అంశాలపై క్లారిటీ వచ్చాకే.. భజ్జీ  ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మరో కొద్ది రోజుల్లో భజ్జీ.. సిద్దూతో మరోసారి భేటీ కానున్నారని కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ భేటీ తర్వాత భజ్జీ కాంగ్రెస్‌లొ చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. భజ్జీ కాంగ్రెస్‌లో చేరితే జలంధర్ లేదా నకోదార్ అసెంబ్లీ స్థానంలో బరిలో నిలపాలని చూస్తుంది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్