Haryana Election Results 2019: హంగ్ దిశగా హర్యానా, బేరసారాలు షురూ

By narsimha lodeFirst Published Oct 24, 2019, 11:41 AM IST
Highlights

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో  హంగ్ దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.దీంతో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. జేజేపీకి చెందిన దుష్యంత్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చింది. 

చంఢీఘడ్: ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వస్తున్నట్టు సంకేతాలు రావడంతో స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడగట్టుకొని  ప్రభత్వం ఏర్పాటు కోసం  కాంగ్రెస్, బీజేపీలు  తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జేజేపీకి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆశ చూపింది. బీజేపీ కూడ స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడ గట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

హర్యానా అసెంబ్లీలో  90 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందిన .సమాచారం ప్రకారంగా బీజేపీకి 40 కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ అభ్యర్ధులు 10 చోట్ల, మరో 11 చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో ఈ ఎన్నికల్లో  బీజేపీకి ఏకపక్షంగా ప్రజలు తీర్పు ఇవ్వలేకపోయారు. హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భూపిందర్ సింగ్ హుడాను సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

read more   election result 2019 video : యమున దాటడమే మిగిలింది బిజేపీపై దుష్యంత్ కామెంట్స్

అంతేకాదు హర్యానా రాష్ట్రానికి పీసీసీ చీప్ పదవిని దళిత వర్గానికి చెందిన కుమారి షెల్జాను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ పరిణామం కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. షెల్జాను పీసీసీ చీఫ్‌గా నియమించడంతో  దళిత ఓటు బ్యాంకును  కాంగ్రెస్ పార్టీ తిరిగి కూడగట్టుకొనే ప్రయత్నం చేసింది.  భూపిందర్ సింగ్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించడంతో జాట్‌లు కొంత  కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరో వైపు ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపకులు ఓంప్రకాష్ చౌతాలా మనమడు దుష్యంత్ చూతాలా జేజేపీ (జననాయక్ జనతా పార్టీ )ని ఏర్పాటు చేశాడు.  దుష్యంత్ ఏర్పాటు చేసిన జేజేపీ కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంకును చీల్చింది. దీంతో ఈ పార్టీ అభ్యర్ధులు 10 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి ముస్లిం, దళిత ఓట్లతో పాటు జాట్లు  కలిసివచ్చారు. మరో వైపు నాన్ జాట్ గా వర్గానికి చెందిన ఖట్టర్ తీసుకొన్న నిర్ణయాలన్నీ కూడ జాట్‌లకు వ్యతిరేకంగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

read more HaryanaAssemblyPolls video : కాంగ్రెస్ బహుమతి వస్తుంది అంటున్నహుడా

జాట్లకు వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయాలను తీసుకొంటుందనే ప్రచారాన్ని విపక్షాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఇది కూడ బీజేపీకి నష్టం కల్గించింది. దీంతో ఇండిపెండెంట్లు, జేజేపీ అభ్యర్ధులు విజయం దిశగా దూసుకెళ్లినట్టుగా  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హర్యానాలో అధికారాన్ని దక్కించుకొనేందుకు కాంగ్రెస్ జేజేపీ, ఇండిపెండెంట్లతో మంతనాలు జరుపుతోంది. ఇదే సమయంలో  హర్యానా సీఎం ఖట్టర్ ను ఢిల్లీకి రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం పిలిచింది. అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీలోనే ఉన్నారు. హర్యానా సీఎం ఖట్టర్ తో అమిత్ షా సమావేశం కానున్నారు.మరో వైపు హర్యానా ఫలితాలపై భూపిందర్ సింగ్ హుడాతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు.

click me!