
గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ తన ట్విట్టర్ బయో నుండి కాంగ్రెస్ ను తొలగించారు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో పార్టీ నుంచి వైదొలిగే ముందు సాధారణంగా రాజకీయ నాయకులు ఈ సంప్రదాయాన్నే ఎంచుకుంటున్నారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇలాగే చేశారు. 2020లో ఆయన అధికారికంగా బీజేపీలో చేరడానికి కొన్ని నెలల ముందు ట్విట్టర్ నుండి కాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని తొలగించారు.
2020లో కోవిడ్ సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ మరణించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. అయితే అతడి కుమారుడు ఫైసల్ పటేల్ AAPలో జాయిన్ అవ్వబోతున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న ఈ సమయంలో ఇప్పుడు హార్థిక్ పటేల్ కూడా ఇలా చర్యకు పూనుకోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడినట్లు అయ్యింది.
2015లో కోటా ఉద్యమానికి నాయకత్వం వహించి గుజరాత్‌లో సంచలనం సృష్టించిన యువ పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ ఒక్క సారిగా వెలుగులోకి వచ్చారు. అయితే ఈ ఉద్యమం సందర్భంలో ఆయన రాజకీయాల్లోకి రానని బహిరంగంగా వాగ్దానం చేశారు. కానీ అతడు 2019లో కాంగ్రెస్‌లో చేరాడు. 2020 జూలైలో రాష్ట్ర యూనిట్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడయ్యారు. అయితే కొన్ని రోజులుగా తనను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పక్కన పెట్టిందని ఇటీవల ఫిర్యాదులు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తనను సరిగా ఉపయోగించుకోవడం లేదని అన్నారు. అయితే హైకమాండ్‌పై మాత్రం విమర్శలు చేయలేదు. కాగా తన ట్విట్టర్ బయో నుంచి హ్యాండ్ సింబల్ ను తొలగించినప్పటికీ హార్దిక్ పటేల్ ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నారని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి తెలిపారు.
28 ఏళ్ల ఫైర్ బ్రాండ్ పాటిదార్ నాయకుడు తీసుకున్న ప్రస్తుత చర్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌ను వీడవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. సోమవారం అప్‌లోడ్ చేసిన ట్విట్టర్‌లో హార్దిక్ పటేల్ తన కొత్త ప్రొఫైల్‌లో తనను తాను “గర్వించదగిన భారతీయ దేశభక్తుడు” అని అభివర్ణించారు. ‘‘సామాజిక మరియు రాజకీయ కార్యకర్త"గా కూడా పేర్కొన్నాడు. అయితే రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేసిందని తెలుపుతూ చేసిన ట్వీట్ ను హార్దిక్ పటేల్ రీ ట్వీట్ చేశారు.
గత నెల రోజులుగా హార్దిక్ పటేల్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొందరు రాష్ట్ర నాయకులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. తనను పార్టీని విడిచిపెట్టాలని వారు భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే దీనిని పార్టీ రాష్ట్ర నాయకులు తిప్పికొట్టారు. ప్రభావవంతమైన పాటిదార్ సామాజిక నాయకుడు నరేష్ పటేల్‌ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ విషయంలో హార్దిక్ పటేల్ పార్టీ అసంతృప్తిగా ఉన్నాడని తెలిపారు. నరేష్ పటేల్ కాంగ్రెస్‌లో చేరితే పాటిదార్ కమ్యూనిటీ నాయకుడిగా తన ప్రాముఖ్యత తగ్గుతుందని హార్దిక్ పటేల్ భావిస్తున్నట్లు వారు చెప్పారు.