
న్యూఢిల్లీ: హేర్ స్టైలిస్ట్(Hair Stylist) జావేద్ హబీబ్(Jawed Habib) వివాదంలో ఇరుక్కున్నారు. ఇదే వారంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఓ వర్క్ షాప్ నిర్వహించారు. అందులో ఓ మహిళను స్టేజ్ పైకి రప్పించి ఆమెకు వెంట్రుకలను కట్ చేస్తూ ఇతరులకు వివరాలను అందజేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆమె వెనుక నిలబడి వెంట్రుకలు పట్టుకున్న ఆయన ఆమె తలపై ఉమ్మివేశారు(Spit on Head). దీంతో హాల్‌లో కొన్ని అరుపులు వినిపించాయి. ఇది తప్పు కాదని, ఉమ్మిలో జీవం ఉన్నదని ఆయన తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, జావేద్ హబీబ్ ఉమ్మివేసిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు. జావేద్ హబీబ్‌పై ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నేషనల్ కమిషన్ ఫరు విమెన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. దీంతో జావేద్ హబీబ్ కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో క్షమాపణలు(Apology) చెప్పారు. తాను కేవలం నవ్వించాలనే ఉద్దేశంతోనే ఆ పని చేసినట్టు వివరించారు.
జావేద్ హబీబ్ యూపీలోని ముజఫర్ నగర్‌లో సోమవారం ఓ సెమినార్ నిర్వహించారు. ఇందులో చాలా మంది ఇతర హేర్‌స్టైలిస్టులు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి స్వయంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్న మహిళ పూజా గుప్తా కూడా వెళ్లారు. జావేద్ హబీబ్ ఆమెను స్టేజ్ పైకి ఆహ్వానించారు. ఆమెను కుర్చీలో కూర్చుని వెంట్రుకలను మరింత స్టైల్ చేయడానికి ప్రయత్నించారు. ఇదే సందర్భంలో ఆయన అనూహ్యంగా వ్యవహరించారు. వెంట్రుకలు మురికిగా ఉన్నాయనుకుంటే.. అసలు వెంట్రుకలు ఎందుకు మురికిగా ఉంటాయి? ఎందుకు అంటే.. షాంపూలు పెట్టడం లేదు కాబట్టి.. అంటూ ఆయన క్యాజువల్‌గా మాట్లాడారు. ఆ తర్వాత మీ దగ్గర నీరు తక్కువగా ఉంటే.. మీ ఉమ్మిని వాడుకోవచ్చు అంటూ.. ఆమె తలపై ఉమ్మేశాడు. దీనిపై ఆ వర్క్ షాప్‌కు హాజరైన వారూ ఆశ్చర్యపడ్డారు. ఈ ఘటనను వివరించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తీవ్ర అభ్యంతరాలు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వెంటనే పరిశీలించాలని యూపీ పోలీసులకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఆదేశించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆ తర్వాత తీసుకున్న యాక్షన్‌ను తమకు తెలియజేయాల్సిందిగా గురువారం ట్విట్టర్‌లో పేర్కొంది.
స్టేజ్ పైకి వెళ్లి కూర్చున్న పూజా గుప్తా కూడా పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయించారు. అనంతరం ఆమె సోషల్ మీడియాలో ఆ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘నిన్న నేను ఆ వర్క్ షాప్‌కు హాజరయ్యాను. ఆయన నన్ను స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఒక వేళ నీరు లేకుండా ఉమ్మి వేయండి అని ఆయన చెప్పారు. ఇక నుంచి నేను నా హేర్ కట్ కోసం వీధిలోని సెలూన్ షాప్‌లకు వెళ్తాను తప్పితే.. హబీబ్ షాప్‌లకు వెళ్లను’ అని ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో జావేద్ హబీబ్ ఓ వీడియోను పోస్టు చేశారు. ‘నేను నిర్వహించినవి ప్రొఫెషనల్ వర్క్ షాప్స్. వాటికి ఈ ప్రొఫెషన్‌లోని వారే ఎక్కువగా హాజరవుతారు. ఈ సెషన్ చాలా దీర్ఘంగా ఉంటే.. మధ్యలో కొంత కామెడీని కూడా జోడిస్తుంటాం. ఒక వేళ మిమ్మల్ని బాధించి ఉంటే.. నేను నా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరకుండా ఇంకేం చేస్తాను. దయచేసి నన్ను క్షమించండి. అయామ్ సారీ’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.