జ్ఞానవాపి వివాదంపై కీల‌క‌ తీర్పు రేపే.. కమిషనరేట్‌లో సెక్షన్-144 అమలు.. కట్టుదిట్టమైన భద్రతా

By Mahesh RajamoniFirst Published Sep 11, 2022, 6:48 PM IST
Highlights

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు సోమ‌వారం కీల‌క తీర్పు ఇవ్వ‌నున్న‌ది.  తీర్పు వెలువడే నేప‌థ్యంలో వారణాసి మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్‌లో సెక్షన్‌-144 అమలు చేశారు.

జ్ఞానవాపి-శృంగార్ గౌరీ కేసు: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై  సోమ‌వారం (సెప్టెంబర్ 12న) వారణాసి జిల్లా కోర్టు కీల‌క తీర్పును వెల్లడించ‌నున్న‌ది. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో ఉన్న శృంగార్ గౌరీకి నిత్య దర్శన పూజల వ్యవహారంపై వారణాసి కోర్టు తీర్పు వెల్ల‌డించ‌నున్న‌ది. దీంతో ఈ విష‌యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛ‌నీయ‌మైన ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. వారణాసి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారణాసి కమిషనరేట్‌లో భద్రతా సమీక్షకు సంబంధించి  నేడు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాంతిభద్రతల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లపై చర్చించారు.

కమిషనరేట్ పరిధిలో సెక్షన్-144 అమలు

సమావేశంలో అన్ని మత పెద్దలు, ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు ఏర్పాటు చేయాలని సూచనలు ఇవ్వబడ్డాయి. కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ను కూడా అమలు చేశారు. దీంతో పాటు సున్నిత ప్రాంతాల్లో ఏరియా డామినేషన్‌ కింద ఫ్లాగ్‌మార్చ్‌, ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కేసుకు సంబంధించి వారణాసిలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతర్ జిల్లాల సరిహద్దుల్లో తనిఖీలు, అప్రమత్తత పెంచారు. దీనితో పాటు.. స్థానిక హోటళ్ళు, ధర్మశాలలు, గెస్ట్ హౌస్‌లలో పోలీసులు భారీ ఎత్తున‌ తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు.  అదే స‌మయంలో సామాజిక మాధ్యమాల్లో నిరంతరం పర్యవేక్షించాలని కూడా సూచనలు చేశారు.

అసలు వివాదం ఏంటి?

జ్ఞాన్‌వాపి-శృంగర్ గౌరీ వివాదం కేసులో తీర్పును కోర్టు సెప్టెంబర్ 12కి రిజర్వ్ చేసింది. ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. కాశీ విశ్వనాథ దేవాలయం, జ్ఞానవాపి మసీదుకు సంబంధించి వివిధ కోర్టుల్లో అరడజనుకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ కేసులో అప్పటి సివిల్‌ జడ్జి రవికుమార్‌ దివాకర్ జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో సర్వే ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సర్వే తర్వాత, శివలింగం మసీదు వజుఖానాలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ముస్లిం పక్షం మాత్రం దీనిని ఫౌంటెన్ అని ఆరోపించారు ఈ కేసులో వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే సర్వేపై అంజుమన్ ఇంతజామియా కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

click me!