
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 విజయవంతం కావడాన్ని దేశమంతటా వేడుక చేసుకుంది. దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపిన ఏకైక దేశంగా భారత్ తన కీర్తిని పెంచుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు ఇన్‌స్టంట్‌గా ఫేమ్ అయ్యే స్కెచ్ వేశాడు. తాను ఇస్రో శాస్త్రవేత్తనేనని, చంద్రయాన్ 3లో కీలకమైన విక్రమ్ మాడ్యూల్‌ను తయారు చేసిందే తానని ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడు ఇస్రో సైంటిస్టు కాదని తేల్చేశారు. ఈ వ్యవహారంపై విచారిస్తున్నారు.
గుజరాత్ సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది ఈ పని చేశాడు. తాను ఇస్రో సైంటిస్టునని చెప్పుకుంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్‌ను రూపొందించింది తానే అని చెప్పుకున్నాడు. తాను ఇస్రో ఫ్రీలాన్సర్‌గా సేవలు అందిస్తున్నాని అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలనిక్రైమ్ బ్రాంచ్ పోలీసులను సూరత్ పోలీసులు కమిషనర్ అజయ్ తోమర్ ఆదేశించారు.
మితుల్ త్రివేది కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తానే విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ తయారు చేశానని, తాను విక్రమ్ ల్యాండర్‌కు ఎన్నో మార్పులు చేశానని, అందుకే అది సేఫ్ గా ల్యాండ్ అయిదని చెప్పాడు. అంతేకాదు, ఆయనకు నాసాతోనూ కలిసి పని చేసిన అనుభవం ఉన్నట్టు చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు నమ్మశక్యం కాకపోవడంతో పోలీసులు దర్యాప్తుకు సిద్ధమ య్యారు. మితుల్ త్రివేది బీకాం డిగ్రీ చేశాడని, ఈ ఘటన పై క్రైమ్ బ్రాంచ్ పూర్తి విచారణ పూర్తి చేస్తుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మితుల్ త్రివేది వ్యాఖ్యలు తప్పని తేలితే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని గుజరాత్ పోలీసులు తెలిపారు.