క్రికెట్‌ బాల్ పట్టుకున్న దళిత బాలుడు.. బొటన వేలు నరికిన అగ్రకులస్తులు.. ఇంతకీ ఏం జరిగింది?  

By Rajesh KarampooriFirst Published Jun 8, 2023, 4:21 AM IST
Highlights

దళిత బాలుడు క్రికెట్‌ బాల్‌ను పట్టుకున్నాడన్న కోపంతో కొందరు అగ్ర కులస్తులు బాలుడి మేనమామపై దాడి చేసి అతడి బొటన వేలును దారుణంగా నరికిన సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 
 

గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక దళిత బాలుడు క్రికెట్‌ బాల్‌ను పట్టుకున్నాడన్న కోపంతో కొందరు అగ్ర కులస్తులు బాలుడి మేనమామపై దాడి చేసి అతడి బొటన వేలును నరికారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు .. ఆదివారం జిల్లాలోని కకోషి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఓ అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ పాఠశాలలోని ప్లేగ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో బంతిని ఎత్తుకెళ్లిన బాలుడిని నిందితులు ఆగ్రహంతో బెదిరించారు.

నిందితులు దళిత వర్గానికి చెందిన సభ్యులను అవమానించడం, బెదిరించే ఉద్దేశ్యంతో కులపరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారని అధికారి తెలిపారు. దీనిపై బాలుడి మేనమామ ధీరజ్ పర్మార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంత సేపు ప్రశాంతంగా ఉందని ఆయన చెప్పారు. అయితే, సాయంత్రం తర్వాత ఏడుగురు వ్యక్తుల బృందం పదునైన ఆయుధాలతో వచ్చి ఫిర్యాదుదారు ధీరజ్, అతని సోదరుడు కీర్తిపై దాడి చేసినట్లు అధికారి తెలిపారు. నిందితుల్లో ఒకరు కీర్తి బొటనవేలును నరికి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. కీర్తి పర్మార్‌ను అహ్మదాబాద్‌లోని వైష్ణోదేవి సర్కిల్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దళిత యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అతనికి చికిత్స అందిస్తున్నారు. 

మరోవైపు ఈ ఘటనతో కకోషి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, మరికొందరిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని పటాన్ ఇన్‌ఛార్జ్ ఎస్పీ విశాఖ దబ్రాల్ తెలిపారు. కకోషి పోలీసులు ఏడుగురిపై అల్లర్లకు పాల్పడడం, ప్రమాదకరమైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరచడం, క్రిమినల్ బెదిరింపులు,దుర్భాషల పదజాలంతో ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద అభియోగాలతో పాటుగా ఫిర్యాదు నమోదు చేశారు.

click me!