
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని బొటాడ్ రైల్వేస్టేషన్ లో సోమవారంనాడు ఆగి ఉన్న డీజీల్ -ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్ రైలులోని మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మంటల్లో మూడు రైలు బోగీలు మంటలకు ఆహుతయ్యాయి. ఈ ఘటనకు కారణాలు ఏమిటో తెలుసుకొనేందుకు విచారణను ప్రారంభించామని పశ్చిమ రైల్వే అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. దృంగాధ్రకు బయలుదేరే రైలు ఖాళీగా ఉండడంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. రైలు బోగీలలో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
రైలు బోగీలలో మంటలు వ్యాపించిన విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. అరగంటకు పైగా మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పివేసినట్టుగా బొటాడ్ మున్సిపల్ అగ్నిమాపక శాఖాధికారి చెప్పారు.