
Niti Aayog's Index: నీతి ఆయోగ్ విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. డిస్కమ్‌ల పనితీరు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ సుస్థిరతతో సహా ఆరు పారామితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (UTలు) ర్యాంక్‌లను కేటాయించారు.
2019-20 గణాంకాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 50.1 పాయింట్లతో నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత కేరళ, పంజాబ్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక చిన్న రాష్ట్రాల విభాగంలో గోవా అగ్రస్థానంలో ఉండగా, త్రిపుర, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అయితే పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ తొలి పది స్థానాల్లో చోటు దక్కలేదు. డిస్కమ్‌ల పనితీరుకు 55.1 స్కోర్ లభించగా.. అందుబాటు ధరల్లో, డిమాండ్‌కు తగిన విధంగా విద్యుత్ సరఫరా చేయడంలో 60.4, శుద్ధ ఇంధన వినియోగానికి 18, విద్యుత్ ఆదాకు 64.7, పర్యావరణ సుస్థిరతకు 34.6, కొత్త కార్యక్రమాలకు 0.4 స్కోరు వచ్చింది. ఇక, ఏపీకి కేటగిరీ వారీగా 12వ ర్యాంకు ఓవరాల్‌గా 18 వ స్థానం దక్కింది.
NITI ఆయోగ్ ప్రకారం.. రాష్ట్ర ఇంధనం మరియు వాతావరణ సూచిక అనేది వాతావరణం, ఇంధన రంగంలో రాష్ట్రాలు, UTలు చేసిన ప్రయత్నాలను ట్రాక్ చేయడానికి ఉద్దేశించిన సూచిక. శక్తి యొక్క వివిధ పారామితులపై సర్వీస్ డెలివరీని మెరుగుపరచడంలోనూ..లోతైన విశ్లేషణకు సహాయపడుతుంది. వాతావరణ మార్పు, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన కోసం భారతదేశం యొక్క లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ పారామితులు రూపొందించబడ్డాయి.
స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్.. స్థోమత, యాక్సెసిబిలిటీ, సమర్థత, డిస్కామ్ పనితీరు, వాతావరణ అనుకూలతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. రాష్ట్రాల మధ్య పోటీని ప్రోత్సహించడానికి డిస్కమ్‌ల ఆర్థిక సాధ్యత, పనితీరు అంశాలు పరిగణనలోకి తీసుకోబడ్డాయి. ఇంధనం, వాతావరణ రంగంలో రాష్ట్రాల పనితీరును ఇండెక్స్ ట్రాక్ చేస్తుందని నీతి ఆయోగ్ తెలిపింది. మెరుగైన నిర్వహణ కోసం రాష్ట్రాలు సకాలంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు, తద్వారా పౌరుల అంచనాలను అందుకోవడానికి ఈ ఫలితాలు సహాయపడతాయి.
పెద్ద రాష్ట్రాలలో గుజరాత్, కేరళ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలు ఫ్రంట్-రన్నర్స్ కేటగిరీ లో టాప్ లో నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు అచీవర్స్ గా నిలిచాయి.
అత్యధిక స్కోరు 50.1 తో గుజరాత్ టాప్ లో నిలిచింది. ఆ తరువాత కేరళ 49.1 స్కోర్ తో రెండవ స్థానంలో నిలువగా.. పంజాబ్ 48.6 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్ లో ఛత్తీస్‌గఢ్ అత్యల్ప స్కోరు (31.7) సాధించింది. స్వచ్ఛమైన ఇంధన కార్యక్రమాలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ సుస్థిరత, కొత్త కార్యక్రమాల పరంగా రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరచలేదని పారామితుల స్కోర్ ఆధారంగా గమనించవచ్చు. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సాల పనితీరు స్వచ్ఛమైన ఇంధన కార్యక్రమాలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ సుస్థిరత, కొత్త కార్యక్రమాల పరంగా మెరుగుదల సాధించాయి.
గుజరాత్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ.. పర్యావరణ సుస్థిరత, కొత్త కార్యక్రమాల పరంగా దాని పనితీరు మెరుగుపడాలి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు SECI స్కోర్ 40-45 మధ్య నమోదనట్టు తెలిపింది. చిన్న రాష్ట్రాల కేటాగిరీలో.. గోవా, త్రిపురలు ముందంజలో ఉన్నాయి, మణిపూర్ అచీవర్ గా నిలిచింది. మిగిలిన చిన్న రాష్ట్రాలు చాలా విషయాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంది.
గోవా అత్యధికంగా 51.4 స్కోరు సాధించగా, అత్యల్ప స్కోరు 27 తో అరుణాచల్ చివరి స్థానంలో నిలిచింది. UT కేటగిరీలో.. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. జమ్మూ మరియు కాశ్మీర్, అండమాన్ నికోబార్స్, లక్షద్వీప్‌లు వరుసగా 29.3, 29.4, 26.9 స్కోర్‌లతో ఆశావాదుల విభాగంలో నిలిచాయి.