
Gujarat Assembly Election: ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు గుజరాత్ పై కన్నేసింది. ఎలాగైనా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి.. అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ లక్ష్యంతోనే ఆప్ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎప్పటికప్పుడూ తన వరవడితో మార్చుకుంటూ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ఆప్ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదనీ, ఇప్పుడు ‘ఆప్’ వస్తోందని ఆప్ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.. గతంలో గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్ ఆప్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని వెల్లడించారు.
ఈ తరుణంలో ఆప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ.. తన అన్ని రాజకీయ సంస్థలను రద్దు చేసింది. రాష్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గోపాల్ ఇటాలియా మినహా అన్ని సంస్థలు రద్దు చేయబడ్డాయి. ఇందులో అన్ని సంస్థలు, విభాగం, మీడియా బృందం ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కొత్త సంస్థను ఏర్పాటు చేయనుందని చెబుతున్నారు.
గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పార్టీ నేతలు సయశక్తుల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో నిరంతరం పర్యటిస్తున్నారు. ఇటీవల త్రివర్ణ యాత్రలో పాల్గొన్న ఆయన మెహసానాకు చేరుకున్నారు.
త్వరలో కొత్త నియామకాలు..
అసెంబ్లీకి ముందు బలమైన వ్యూహం సిద్ధం చేయడానికి... ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఆప్ భావిస్తోంది. గుజరాత్‌లోని 33 జిల్లాల అధ్యక్షులతో సహా దాదాపు 50 స్థానాల్లో కొత్త నియామకాలను చేపట్టనుంది. వీటిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జి తదితర పదవులు ఉన్నాయి.
ప్రజల్లో విశ్వసనీయత ఉన్నవారి ప్రాధాన్యత
ఆద్మీ పార్టీ తన రాజకీయ సంస్థలను పునర్వ్యవస్థీకరించాలని, ప్రజల్లో విశ్వసనీయత ఉన్న, పార్టీ తరుపున పని చేసే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ మేరకు కొత్త నాయకులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే, ఈ సారి కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లను పొందగలదని భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ సన్నాహాలు ప్రారంభించింది.
కాంగ్రెస్ కు గట్టి షాక్ ..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. పాటిదార్ఉద్యమ నేత, యువ నాయకుడు హార్దిక్ పటేల్ అధికార బీజేపీలో చేరారు. గత వారం పార్టీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ సమక్షంలో గాంధీనగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.