FabiSpray: కరోనాకు విరుగుడుగా భారత్‌లో తొలి నాసల్ స్ప్రే.. ఫాబిస్ప్రే లాంచ్ చేసిన గ్లెన్‌మార్క్

Published : Feb 09, 2022, 01:47 PM IST
FabiSpray: కరోనాకు విరుగుడుగా భారత్‌లో తొలి నాసల్ స్ప్రే.. ఫాబిస్ప్రే లాంచ్ చేసిన గ్లెన్‌మార్క్

సారాంశం

భారత్‌లో కరోనావైరస్ చికిత్సకు తొలి నాసల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ఫాబిస్ప్రేను మన దేశంలో తయారుచేయడానికి, మార్కెటింగ్ చేయడానికి గ్లెన్‌మార్క్‌కు భారత రెగ్యులేటర్ డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ నాసల్ స్ప్రే క్లినికల్ ట్రయల్స్ డేటాను ఇంకా పీర్ రివ్యూడ్ జర్నల్స్ ప్రచురించలేదు. కానీ, యూరోపియన్ యూనియన్ ఈ నాసల్ స్ప్రేకు మంచి గుర్తింపు ఇచ్చింది.  

న్యూఢిల్లీ: ముంబయిలోని ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్(Glenmark).. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే(Nasal Spray)ను మన దేశంలో ప్రవేశపెట్టింది. శానోటైజ్ కంపెనీతో భాగస్వామ్యంలో మన దేశంలో ఫాబిస్ప్రే(FabiSpray)ను లాంచ్ చేసింది. వయోజనుల్లో కరోనా(Coronavirus)ను ట్రీట్ చేయడానికి ఈ నాసల్ స్ప్రే సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రేను తయారుచేయడానికి, మార్కెటింగ్ చేయడానికి గ్లెన్‌మార్క్ ఫార్మా కంపెనీకి భారత డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ(DCGI) అనుమతులు ఇచ్చింది.

మన దేశంలో ఫేజ్ 3 ట్రయల్ పరీక్షల్లో ఈ నాసల్ స్ప్రే అద్భుతంగా పని చేసినట్టు తేలిందని కంపెనీ అధికారిక ప్రకటన తెలిపింది. 24 గంటల్లో 94 శాతం వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని, 48 గంటల్లో 99 శాతం వైరల్ లోడ్‌ను ఈ నాసల్ స్ప్రే తగ్గిస్తున్నట్టు తేలిందని వివరించింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే సేఫ్ అని, కొవిడ్ పేషెంట్లూ ఈ స్ప్రే ద్వారా ఇబ్బంది పడరని పేర్కొంది. గ్లెన్‌మార్క్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రేను ఫాబిస్ప్రే బ్రాండ్ నేమ్‌తో భారత్‌లో విక్రయిస్తుందని వివరించింది. 

శ్వాస వ్యవస్థ ఎగువ భాగంలో కరోనా వైరస్‌ను చంపడానికి ఈ స్ప్రే ఉపయోగపడుతుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ స్ప్రేను ముక్కులోకి పంపినప్పుడు అది వైరస్‌కు ఫిజికల్‌గా కెమికల్‌గా ఒక బారియర్‌గా నిలుస్తుందని వివరించింది. తద్వార వైరస్‌ ఇంక్యూబేట్ కాకుండా, అలాగే, ఊపిరితిత్తులకు చేరకుండా నిరోధిస్తుందని పేర్కొంది. అయితే, ఈ కంపెనీ ట్రయల్ డేటాను ఇంక పీర్ రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురించాల్సి ఉన్నది. కానీ, దీనికి ముందే యూరోపియన్ యూనియన్ దానికి సీఈ మార్క్ ముద్ర వేసింది. 

క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ క్లినికల్ డెవలప్‌మెంట్ హెడ్, సీనియర్ వీపీ డాక్టర్ మోనికా టాండన్ మాట్లాడారు. పేషెంట్‌లోని వైరల్ లోడ్‌ను ఈ నాసల్ స్ప్రే గణనీయంగా తగ్గిస్తున్నదని వివరించారు. కొత్త వేరియంట్లతో కరోనా పంజా విసురుతున్న ఈ సమయంలో నాసల్ స్ప్రే భారత ప్రజలకు మరో ఉపయోగకరమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఉటా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం, నాసల్ స్ప్రేలు 99.9 శాతం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ వేరియంట్‌లను రెండు నిమిషాల్లో నాశనం చేస్తాయని తేలిందని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !