తమిళనాడు స్కూల్ లో దారుణం.. బాత్రూంలో ప్రసవం, పెన్నుతో బొడ్డుతాడు కోసి.. అక్కడే వదిలేసిన వైనం..

By Bukka SumabalaFirst Published Sep 8, 2022, 12:37 PM IST
Highlights

తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 11వ తరగతి చదువుతున్న ఓ పదహారేళ్ల అమ్మాయి స్కూల్ బాత్రూంలో ప్రసవించింది. తన దగ్గరున్న పెన్నుతో బొడ్డుతాడు కోసి.. శిశువును అక్కడే వదిలేసి వెళ్లింది. 

తమిళనాడు : తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నవజాత శిశువు మృతదేహం ఉందనే సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే పోలీసులకు తెలిసిన విషయాలు వారిని షాక్ కు గురిచేశాయి. పాఠశాలలో చదువుకునే విద్యార్థిని చేసిన పని తెలిసిన అధికారులు విస్తుపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తమిళనాడులోని కడలూరు జిల్లా, చిదంబరం టౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద స్థానికులు గత గురువారం నవజాత శిశువు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు  ప్రారంభించారు. వారి దర్యాప్తులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న16 ఏళ్ల విద్యార్థిని ఈ శిశువుకు జన్మనిచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ అమ్మాయిని విచారించారు. సదరు విద్యార్థిని నిజం ఒప్పుకుంది.  

గల్ఫ్ మోసగాళ్ల చెరలో చిక్కుకున్న యువతి.. కాపాడిన హర్భజన్ సింగ్..భేష్ భజ్జీ అంటూ ప్రశంసలు
స్కూల్ కు వచ్చిన వెంటనే తీవ్రంగా కడుపునొప్పి రావడంతో బాత్ రూమ్ కి వెళ్లినట్లు తెలిసింది. అక్కడే  చిన్నారిని ప్రసవించానని..  ఆ తరువాత తన దగ్గర ఉన్నపెన్నుతో బొడ్డుతాడు కత్తిరించినట్లు పేర్కొంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను అక్కడే వదిలేసి వచ్చినట్లు అంగీకరించింది. తాను గర్భం దాల్చిన విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలియదని వెల్లడించింది. ఈ మాటలు విని పోలీసులు  నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కారణమైన వారి గురించి పోలీసులు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

అయితే,  అందుకు సంబంధించిన వివరాలు ఆమె తెలుపలేదు. దీంతో సదరు విద్యార్థిని ఆస్పత్రికి తరలించిన అధికారులు.. కొంతమంది అనుమానితుల జాబితాను సిద్ధం చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం జరగని కారణంగా.. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. అంతే కాకుండా, సురక్షిత ప్రసవం జరగని కారణంగానే పుట్టిన బిడ్డ మరణించి ఉండవచ్చని భావిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 
 

click me!