కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ శుక్రవారం నాడు రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ శుక్రవారం నాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలోని అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ఆజాద్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి పంపారు1970 లలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోసమే పని చేసినట్టుగా తన రాజీనామా లేఖలో ఆజాద్ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడం లేదని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఇప్పటికీ రిమోట్ కంట్రోల్ మోడల్ తో కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఆజాద్ విమర్శించారు. ఆజాద్.ఈ నెల 16వ తేదీన జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ పదవికి కూడా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో జీ-23 గా పేరొందిన అసమ్మతివాదుల్లో గులాం నబీ ఆజాద్ ప్రముడిగా ముద్రపడ్డారు.జీ -23 నేతలు 2020లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని జీ 23 నేతలు కోరుతున్నారు.
పార్టీని ప్రక్షాళన చేయకపోతే మనుగడ కష్టమనే అభిప్రాయాన్ని అసమ్మతివాదులు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుండి పార్టీ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా గులాం నబీ ఆజాద్ గతంలో డిమాండ్ చేశారు.ఈ మేరకు పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. అసమ్మతివాదులతో పార్టీ నాయకత్వం గతంలో చర్చలు జరిపింది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కూడా నిర్వహిస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు కూడా షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో గులాం నబీ ఆజాద్ పాత్ర కీలకం. ఆనాడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పని చేశారు. అప్పడు సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ఆర్ చేసిన పాదయాత్రకు తోడుగా పార్టీ సీనియర్లతో కలిసి బస్సు యాత్ర చేయించడంలో ఆజాద్ ప్రముఖపాత్ర పోషించారు.పార్టీ సీనియర్ల మధ్య సమన్వయం పెంపొందించేందుకు గాను బస్సు యాత్ర దోహదపడింది. పాదయాత్ర, బస్సు యాత్రతో పాటు ఆనాటి రాజకీయ పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. అంతేకాదు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్, టీఆర్ఎస్ లతో పొత్తు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు అప్పట్లో వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందుగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆజాద్ ఆ సమయంలో కీలకంగా వ్యవహరించారు. కర్ణాటక రాష్ట్రంలో అనుసరించిన వ్యూహాలను ఏపీలో అమలు చేశారు. ఈ వ్యూహాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ సమయంలో గులాం నబీ ఆజాద్ కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు.