బీజేపీకి గుడ్ బై.. కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. కాషాయ పార్టీపై కీలక కామెంట్స్..

By Sumanth KanukulaFirst Published Dec 25, 2022, 1:45 PM IST
Highlights

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. కొద్ది రోజుల క్రితం బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనార్దన్ రెడ్డి.. ఆ పార్టీతో తనబంధం ముగిసిందని చెప్పారు.

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. కొద్ది రోజుల క్రితం బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనార్దన్ రెడ్డి.. ఆ పార్టీతో తనబంధం ముగిసిందని చెప్పారు. అదే సమయంలో తన కొత్త పార్టీ పేరును కూడా ప్రకటించారు. ఆదివారం నగరంలోని తన నివాసం ‘‘పారిజాత’’‌లో జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  కొత్త పార్టీ ‘‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’’తో రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పారు. 

‘‘రాష్ట్ర ప్రగతి నా లక్ష్యం. నేను మార్గంలో అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని కూడా నిర్మిస్తాను’’ అని  గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త పార్టీని ప్రకటించిన జనార్దన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. “మా పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల గురించి త్వరలో తెలియజేస్తాను. త్వరలో పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాం’’ అని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. 

తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ‘‘ప్రజా సేవ చేయాలని అనుకున్నాను. ఇప్పటికే గంగావతి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకున్నాను. నా పేరు కూడా ఓటర్ లిస్టులో ఉంది. అక్కడి నుంచే పోటీ చేస్తాను. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు’’ అని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇక, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొత్త పార్టీ ప్రకటన అధికార బీజేపీలో కలకలం రేపుతోంది.

‘‘రాష్ట్ర రాజకీయాల్లో నా వాళ్లు అనుకున్న వారే మోసం చేశారు. కష్టకాలంలో ఎవరూ నాకు అండగా నిలబడలేదు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ తప్ప మరెవ్వరూ నా ఇంటికి రాలేదు. వాళ్లిద్దరూ మాత్రమే నన్ను ప్రోత్సహించారు. నేను వారిని గుర్తుంచుకుంటాను’’అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 

‘‘రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రజలను విభజించి.. తద్వారా  లబ్ది పొందాలని ప్రయత్నిస్తే కర్ణాటకలో అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉంటారు. నాకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవు. శ్రీరాములు చిన్నప్పటి నుంచి నాకు ఆప్తమిత్రుడు. ఇకపై కూడా మంచి అనుబంధం కొనసాగిస్తాం’’ అని అన్నారు.

click me!