ఫ్రమ్ ది ఇండియా గేట్‌: కోడళ్ల మధ్య పోరు, యాక్షన్‌లో ఆమె మిస్సింగ్, ట్రోఫిపై మ్యాప్ కథేంటి..

By Asianet NewsFirst Published Jan 6, 2023, 3:26 PM IST
Highlights

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో మాజీ ప్రధాని హెడీ  దేవెగౌడ కోడళ్ల మధ్య పోరు, సైలెంట్ మోడ్‌లో బీజేపీ మహిళా నేత వంటి విషయాలను తెలుసుకుందాం..


ట్రోఫిపై మ్యాప్‌ గురించి ఈ విషయం తెలుసా..
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 మరికొద్దిరోజుల్లో భారత్‌లో ఒడిశాలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో పురుషుల హాకీ ప్రపంచ కప్ ట్రోఫీ‌పై ఉన్న ప్రపంచ పటంలో జమ్మూ- కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారని మీకు తెలుసా?. అయితే ఈ విషయం మీరు తెలుసకోవాల్సిందే.. ఆసక్తికరంగా 1975లో భారతదేశం గెలిచిన ప్రపంచ కప్ ట్రోఫీ కూడా జమ్మూ- కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపింది. పాకిస్తాన్ అనేక సందర్భాల్లో ఎఫ్‌ఐహెచ్(ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్) ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో సభ్యుడిని కలిగి ఉంది. దీంతో వారు చెప్పినట్టుగా నడిచింది. 

అయితే 2016లో నరీందర్ బాత్రా ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడైన తర్వాత పరిస్థితి  మారింది. అప్పుడు ట్రోఫిపై మ్యాప్‌లో మార్పులు చేసే అవకాశం భారతదేశానికి లభించింది. 2018లో భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఈ ట్రోఫీని అందజేసేందుకు భారతీయ రాజకీయ నేతలెవరినీ అనుమతించబోనని నరీంద్ర బాత్రా చెప్పారు. అలాగే ట్రోఫిపై తప్పుడు మ్యాప్ ఉన్న నేపథ్యంలో.. ఆ ట్రోపిని భారతదేశంలోకి ప్రవేశించడానికి భారతీయ కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేరని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చివరకు 2017లో ట్రోఫిపై మ్యాప్ సరిదిద్దబడింది. ఆ తర్వాత ట్రోఫిపై ఖండాలతో కూడిన మ్యాప్‌ను ప్రదర్శించారు. మ్యాప్‌లో దేశాల డివిజన్‌ లైన్‌ను తీసేశారు.

ఇంటి కథ.. కోడళ్ల మధ్య పోరు
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబ వృక్షం బాగానే విస్తరించింది. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి పలువురు చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే త్వరలోనే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దేవెగౌడ కుటుంబ సభ్యులు యే దిల్ మాంగే మోర్ (మరింతగా కావాలి)  అంటూ పట్టుబడుతున్నారు. దేవెగౌడ స్థాపించిన జేడీఎస్ నుంచి ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఎన్నికల సీజన్‌లో గౌడ కుటుంబానికి చెందిన మరికొంత మంది వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మైసూరు ప్రాంతంలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే కీలకమైన సీట్ల విషయంలో దేవెగౌడ కోడళ్ల మధ్య పోరు సాగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. 

ప్రస్తుతం దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దేవెగౌడ కుమారులు హెచ్‌డీ కుమారస్వామి, హెచ్‌డీ రేవణ్ణ, కోడులు అనిత కుమారస్వామి (హెచ్‌డీ కుమారస్వామి భార్య) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ (హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు) లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు డీసీ తమ్మన్న, బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.  మరో మనవడు సూరజ్ (హెచ్‌డీ రేవణ్ణ మరో కుమారుడు) శాసన మండలి సభ్యుడిగా,  కోడలు భవానీ(రేవణ్ణ భార్య) హసన్ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది కుటుంబ సభ్యుల అభ్యర్థిత్వాన్ని జేడీఎస్ పార్టీ ప్రకటించింది. తదుపరి రౌండ్‌లో మరింత మందికి టిక్కెట్లు లభించనున్నాయి. అయితే వీరి జాబితా చాలా పెద్దదిగా కనిపిస్తోంది. కానీ ఈ జాబితా సమయంలో కుటుంబంలో విభేదాల చోటుచేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా భవానీ రేవణ్ణ, అనిత కుమారస్వామి మధ్య రాజకీయ దంగల్ ఫలితంపైనే అందరి దృష్టి ఉంది. ఎవరు విజేతగా నిలుస్తారనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది.


కుల సమీకరణాలు.. 
కర్ణాటకలోని కుల జాడలలో ఒక్కళిగ సామాజిక వర్గం కూడా గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహించడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని బీజేపీ ఇష్టపడటంలో ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో.. రాష్ట్రంలో ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని ఒక్కళిగ సామాజిక వర్గంతో సంబంధాలను కొనసాగించడానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప లింగాయత్ వర్గాలను అండగా ఉంచుతారని బీజేపీ విశ్వసిస్తోంది. కానీ వారికి ఒక్కళిగ ఓట్లను ఆకర్షించే ప్రణాళికలు కావాలి. 

కర్ణాటక బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు నలీన్ కుమార్ కేటీల్ పదవీకాలం పూర్తికానుండటంతో త్వరలో ముందస్తు వేట ముమ్మరం కానుంది. బీజేపీ ఒక్కళిగల మద్దతు కోసం చూస్తున్న తరుణంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ సామాజికి వర్గానికే చెందిన ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్ అశ్వత్‌ నారాయణ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిల మధ్య పోటీ ఉండనుందని బీజేపీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి.

పైలెటింగ్ ఆలోచన..
చాలా మంది రాజకీయ నాయకులు మాటల మధ్యలో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటారు. ఇందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అతీతం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే రాజస్తాన్ కాంగ్రెస్‌ మరోసారి కఠిన సమయం ఎదుర్కొనే అవకాశాలు  కనిపిస్తాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవలి ఇంటర్వ్యూలో గెహ్లాట్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగాలనే తన కోరికను పరోక్షంగా చాలా నిజాయితీగా వ్యక్తీకరించారు. ఆ మాటలను గమనిస్తే.. గెహ్లాట్‌ రిటైర్‌ అయ్యే మూడ్‌లో లేనట్లుగా తెలుస్తోంది.

‘‘మా పార్టీ మరింత బలపడుతోంది. మా ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం. నేనేమీ పేరు పెట్టను కానీ సీఎం ఎవరో మీ అందరికీ తెలుసు’’ అని గెహ్లాట్ అన్నారు. తద్వారా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్నది జనాల ఊహకు వదిలేశారు. అయితే ఈ మాటలు  చూస్తుంటే.. రాజస్తాన్ కాంగ్రెస్ ‘‘యువ నాయకుడు’’ తన కల నెరవేర్చుకోవడానికి మరింతగా నిరీక్షణను కొనసాగించవలసి ఉంటుంది. అయితే రాజస్తాన్‌లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఒక యువ ముఖం నాయకత్వం వహిస్తుందని  గత కొంతకాలంగా సాధారణ అంచనా ఉన్నప్పటికీ.. గెహ్లాట్ ఇంటర్వ్యూ తర్వాత ఆ అంచనా కాస్తా అస్తవ్యస్తంగా మారింది. దీంతో పార్టీలో త్వరలో గానీ, ఆ తర్వాత గానీ కొంత కఠినమైన వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముందుగానే సీటు బెల్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

యాక్షన్‌లో ఆమె మిస్సింగ్.. 
ఆమె ఎక్కడ? అన్నది రాజస్తాన్ బీజేపీ జరుగుతున్న చర్చ. బీజేపీకి చెందిన ఆ ప్రముఖ మహిళా నాయకురాలు మొన్నటి వరకు  మీడియా అంతటా తన ప్రకటనలతో ప్రస్ఫుటంగా ఉండేవారు. అయితే ఆమె ప్రస్తుతం నిద్రాణస్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ప్రశంసలు పొందేందుకే ఆమె స్వయంగా మౌనవ్రతం విధించుకున్నారని పార్టీ అంతర్గత వ్యక్తులు భావిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ జనవరి 10వ తేదీన రాజస్థాన్‌లో ఉంటారని భావిస్తున్న నేపథ్యంలో.. పార్టీ సీనియర్‌లకు చికాకు కలిగించే వివాదాస్పద విషయాల గురించి మాట్లాడకుండా ఉండేందుకు మౌనం వహించడం ఆ మహిళా నేత వ్యూహంగా కనిపిస్తోంది.

click me!