ఫ్రమ్ ది ఇండియా గేట్‌: షా చాణక్య నీతి, ఆ సీఎం సమాధానమే వాతావరణం, కాంగ్రెస్ జోడోకు సమయం..

By Asianet NewsFirst Published Dec 29, 2022, 6:06 PM IST
Highlights

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాణక్య నీతి.. 
భారతీయ జనతా పార్టీ మాస్టర్ స్ట్రాటజిస్ట్‌, ప్రధాన ఆయుధాలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒకరు. ఆయనను పార్టీ చాణక్య‌గా కూడా పిలుస్తుంటారు. పూర్తి నిశ్శబ్దంతో సమస్యలను పరిష్కరించే కళ కూడా ఆయన సొంతం. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యం కనిపించింది. కర్ణాటక బీజేపీకి చెందిన  ఓ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పల మధ్య ‘‘సంధి’’ కుదిరిన ఘటనను పార్టీలోని అంతర్గత వ్యక్తులు గుర్తు చేసుకున్నారు.

ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలైన బీఎస్ యడియూరప్ప, ఆ సీనియర్ నేత మధ్య చిరకాల విభేదాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో..  సీనియర్ నేతల మధ్య విభేదాలు పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే చాణక్య రంగంలోకి దిగారు. ఓ ఉమ్మడి వేదికలో  అమిత్ షా.. ఆ ఇద్దరు నేతలతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలూ అమిత్ షాకు ఇరువైపులా కూర్చున్నారు. అక్కడ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. ఎలాంటి చర్చలోనూ పాల్గొనకుండా టీవీ చూస్తూ ఉన్నారు. కానీ వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత చాణక్యకు బయట మీడియా ఎదురుచూస్తున్నట్టుగా సమాచారం అందింది. దీంతో చాణక్య.. ‘‘చలో.. జయంగే’’ అంటూ చమత్కరించి.. నేతలిద్దరినీ మీడియా వద్దకు తీసుకెళ్లారు. 

మీడియా వద్ద చాణక్య.. ఇరువురు నేతల చేతులను పైకెత్తారు. అక్కడ అంతా సంతోషంగా ఉందనే సంకేతాలను పంపారు. విజయ చిహ్నాంతో.. ఈ వార్త ప్రధాన అంశంగా నిలుస్తుందని నిర్దారించుకుని అక్కడి నుంచి చాణక్య వెళ్లారు. దీంతో మీడియా చాణక్య.. 15 నిమిషాలలో ఇరువురు నేతల మధ్య  విభేదాలను చర్చలతో పరిష్కరించారని రిపోర్ట్ చేసింది. కర్ణాటక బీజేపీలో కొనసాగుతున్న పలు దీర్ఘకాలిక సమస్యలకు ఇటువంటి  సింగిల్ టచ్ నివారణలు ఉన్నాయని అంతర్గత వ్యక్తులు భావిస్తున్నారు.


బెర్త్‌లపై ఆశలు.. 
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరగడంపై నిశ్శబ్ధం నెలకొంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌లలో.. ఎలాగైనా చోటు దక్కించుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా మంత్రివర్గ విస్తరణకు ఆసక్తి చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలే (2023 మే) ఉండటంతో..  అసెంబ్లీ ఎన్నికల్లో కురుబలు, గొల్లరు, గంగా మాతస్తరు, వాల్మీకులు, పంచమసాలీల ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఇదొక అవకాశంగా ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది.

అయితే పార్టీలోనే తనపై విమర్శలు గుప్పించే మాజీ సీఎం కేబినెట్‌లోకి అవకాశం ఇవ్వడానికి బసవరాజ్ బొమ్మై ఇష్టపడం లేదు. అయితే కేబినెట్ విస్తరణ అనేది తేనె తుట్టను కదిలించినట్టవుతుందని.. ఆ ఎఫెక్ట్ సీఎం బొమ్మై మీదనే ఉంటుందనే సంకేతాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణకు సంబంధించి.. త్వరలో కర్ణాటకలో పర్యటించనున్న హోంమంత్రి అమిత్ షాపైనే అందరి దృష్టి ఉంది. ఏది ఏమైనా ఫైనల్ నిర్ణయం ఢిల్లీ నుంచే రావాల్సి ఉంటుంది. 

బయట వాతావరణం.. 
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియా నుంచి ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే కళ చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి.  మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఆయన చెప్పిన సమాధానాలు వింటే మీరు కూడా అవుననే అంటారు. మీడియా ప్రశ్నలను దాటవేయడానికి ఆయన ‘‘వాతావరణం’’ను వాడుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో పినరయి విజయన్‌‌ను మీడియా ప్రతినిధులు కేరళలో అధికార సీపీఎంలో చెలరేగుతున్న సమస్యల(ఇటీవల సీపీఎం కన్నూర్‌ ఫైర్‌బ్రాండ్‌ నేత పీ జయరాజన్‌.. పార్టీ సహచరుడు ఈపీ జయరాజన్‌పై తీవ్రమై ఆర్థిక ఆరోపణలు చేశారు) గురించి ప్రశ్నించారు. అయితే చాలా చల్లగా బదులిచ్చిన పినరయి విజయన్.. ‘‘నిజానికి ఇక్కడ (ఢిల్లీలో) చాలా చలిగా ఉంది’’ ఉందని చెప్పారు.

కొన్ని వారాల క్రితం సీపీఐ జాతీయ నాయకుడు అని రాజా, ఇడుక్కి చెందిన సీపీఎం సీనియర్ నేత ఎంఎం మణి మధ్య చెలరేగిన వివాదం  గురించి మీడియా పినరయి విజయన్ అడిగిన సమయంలో.. ‘‘వర్షం’’ ఆయనను రక్షించింది. ‘‘ఊహించని వర్షం.. మనకు మంచి వర్షాలు కురుస్తున్నాయి.. రైట్?’’ అని ఆ ప్రశ్నను దాటవేశారు.

ఇక, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం గురించి పినరయి విజయన్‌ను అడిగినప్పుడు.. ఆయన తమాషాగా ‘‘మాస్క్‌లు ముఖాన్ని కప్పుకోవడానికి సహాయపడతాయి!’’ అని పేర్కొన్నారు.  అయితే కొన్నిసార్లు విజయన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తారు.. అటాకింగ్ మోడ్‌లోకి వెళతారు. కానీ చాలా తరచుగా ఆయన వద్ద సరైన సమాధానాలు లేనప్పుడు.. ‘‘వాతావరణం’’ సాయం తీసుకుంటాడు.

కాంగ్రెస్ జోడోకు సమయం అసన్నమైంది.. 
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తమిళనాడు నుంచే ప్రారంభించిన సంగతి  తెలిసిందే. ఆ సమమయంలో  చిరునవ్వుతో కూడిన ముఖాలతో కనిపించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ మార్పు చేపట్టాలని  పార్టీ అధిష్టానం భావించింది. ఇందుకోసం పార్టీ అధిష్టానం వేట ప్రారంభించగా.. ఒక మాజీ ఆర్థిక మంత్రి కుమారుడి అవకాశాలను ఒక ప్రముఖ తమిళనాడు నాయకుడు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఇరకాటంలోకి వెళ్లింది. ప్రచారంలో ఉన్న మరో మూడు పేర్లు కూడా అంతర్గత పోరాటాల చీలికల ద్వారా ఆచరణకు నోచుకోలేదు.

మరోవైపు కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఉన్న ఓ వ్యాపారవేత్తను పార్టీ పదవి నుండి తొలగించడం ఇటీవల నిప్పు రాజేసింది. ఈ నిర్ణయంతో కోపోద్రిక్తులైన కొందరు నాయకులు ఢిల్లీలో క్యాంప్ చేసి గంటల్లోనే ఈ ఆర్డర్‌ను రద్దు చేశారు. అయితే ఆ ప్రముఖ నాయకుడిని ఎదుర్కోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుధీర్ఘ చర్చల తర్వాత కూడా ఎటువంటి ప్రత్యామ్నాయం కనుగొనబడలేదు. ఒక మహిళా నాయకురాలి పేరు వినిపించినా అది కూడా తిరస్కరించబడింది.

దీంతో చివరగా కాంగ్రెస్ పార్టీ అదే నాయకుడి ఆధ్వర్యంలో 2024 ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. అయితే అన్ని వర్గాలకు న్యాయమైన సీట్ల కేటాయింపు జరిగేలా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ జోడో యాత్రకు సమయం వచ్చిందా రాహుల్?

వలస నాయకుడు.. 
కాంగ్రెస్‌కు తెలంగాణలో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకంపై సీనియర్ నేత వీ హనుమంతరావు‌తో మరికొందరు కూడా బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి ఇవ్వడంపై వారు వ్యతిరేకించారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉంటున్నవారికి అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. మరోవైపు ఇటీవల పీసీసీ కమిటీల కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ.. తదితరులు ఒర్జినల్ కాంగ్రెస్ నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో టీ కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం వర్సెస్ రేవంత్ వ్యతిరేక వర్గంగా సీన్ మారింది. 

ఒర్జినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ ఫైట్‌ను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తమ దూతగా రంగంలోకి దింపింది.  పార్టీలో చెలరేగిన నిప్పును చల్లార్చేందుకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలపై దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌లో క్యాంప్‌ చేశారు. పార్టీ నేతలతో విడివిడిగా చర్చలు జరిపిన దిగ్విజయ్ సింగ్.. పార్టీ నేతలు వారి సమస్యలను అంతర్గత వేదికపై మాత్రమే చర్చించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు వంటివి ఉండవని చెప్పారు. రేవంత్ రెడ్డిపై పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్న ప్రశ్నకు దిగ్విజయ్ సమాధానమిస్తూ.. అలా ఏం ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు.  పార్టీలో అన్నీ పరిష్కరించబడ్డాయి.. సమస్య లేదని కూడా చెప్పారు. 

అయినప్పటికీ ఒకరిద్దరు నేతలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పదవి నుంచి మాణిక్కం ఠాగూర్‌ను తొలగించేందుకు రాజీ ఫార్ములా సూచనప్రాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి మాణిక్కం ఠాగూర్‌ నుంచి చాలా మద్దతు ఉందని, ఆయన ఇతర నేతల మాటలు పట్టించుకోవడం లేదని సీనియర్ల నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అయితే దీనికి ఏఐసీసీ ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. 

click me!