వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు మృతి, 24 మందికి గాయాలు..

By Sumanth KanukulaFirst Published Sep 3, 2022, 10:13 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వివరాలు.. బారాబంకిలోని మహుంగుపూర్ సమీపంలో డబుల్ డెక్కర్ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నేపాలీ వలస కూలీలతో డబల్ డెక్కర్ బస్సు గోవాకు వెళ్తుండగా టైర్ పంక్చర్ అయింది. దీంతో బస్సు డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ.. బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికుల్లో.. నలుగురు మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం బారాబంకి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. బారాబంకి జిల్లా ఆసుపత్రి వైద్యులు వారిని లక్నో ట్రామా సెంటర్‌కు పంపినట్లు బరాబని సీనియర్ పోలీసు అధికారి పూర్ణేందు సింగ్ తెలిపారు.

బస్సులో మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని.. తాము వారిని నేపాల్‌కు తిరిగి పంపే ప్రక్రియ చేపట్టామని పూర్ణేందు సింగ్ చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. 

click me!