అమెరికాలో ఎనిమిది నెలల పాప సహా నలుగురు భారతీయుల కిడ్నాప్... అపహరించింది ప్రమాదకరమైన మనుషులే?

By Mahesh KFirst Published Oct 4, 2022, 1:49 PM IST
Highlights

అమెరికాలో నలుగురు భారతీయులను కిడ్నాప్ చేశారు. ఈ నలుగురిలో ఎనిమిది నెలల పాప కూడా ఉన్నది. వీరిని అపహరించిన వారు ప్రమాదకారులని, వారి దగ్గర ఆయుధాలు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

న్యూఢిల్లీ: అమెరికాలో ఎనిమిది నెలల పాప సహా భారత సంతతికి చెందిన నలుగురు అపహరణకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఈ కిడ్నాప్ జరిగినట్టు అధికారులు తెలిపారు.

మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 36 ఏళ్ల జస్‌దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల పాప అరూహి ధేరి సహా 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ కూడా కిడ్నాప్‌నకు గురయ్యారు. నిందితులు చాలా ప్రమాదకారులని, వారి దగ్గర ఆయుధాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నది. ఇందుకు సంబంధించిన సమాచారాలు పెద్దగా విడుదల చేయలేదు. అయితే, సౌత్ హైవే 800 బ్లాక్ సమీపంలో ఈ నలుగురిని వారి ఇష్టాలకు వ్యతిరేకంగా ఎత్తుకెళ్లారని అధికారులు పేర్కొన్నట్టు ఏబీసీ 30 రిపోర్ట్ చేసింది.

రిటైలర్లు, రెస్టారెంట్లు ఉన్న వీధి నుంచే వారిని కిడ్నాప్ చేశారు. అధికారులు అనుమానితుల పేర్లు గానీ, ఈ నలుగురిని కిడ్నాప్ చేయడానికి గల కారణాలనూ పేర్కొనలేదని ఎన్‌బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.

అనుమానితులు లేదా బాధితులు కనిపిస్తే.. వెంటనే వారి వద్దకు వెళ్లవద్దని షెరీఫ్ కార్యాలయం తన స్టేట్‌మెంట్‌లో సూచించింది. కానీ, వారు కనిపిస్తే 911కు కాల్ చేయాలని తెలిపింది.

2019లోనూ భారత సంతతి టెకీ తుషార్ ఆత్రె కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈయన ఓ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి ఓనర్. కాలిఫోర్నియాలో పోష్ ఇంట్లో ఉన్నాడు. ఆయనను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అపహరించిన గంటల వ్యవధిలోనే ఆత్రె గర్ల్‌ఫ్రెండ్ కారులో విగత జీవిగా కనిపించాడు.

click me!