
Oommen Chandy: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెల్లడించారు. వాస్తవానికి ఆయన ఆరోగ్యం 2019 నుండి బాగా లేదు. చాందీకి గొంతు సంబంధిత వ్యాధి రావడంతో జర్మనీకి తీసుకెళ్లారు. ఆయన కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1970 నుంచి రాష్ట్ర అసెంబ్లీకి పుత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించిన ఆయన సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు. ఆయన నిజాయతీతో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా మెలిగాడు.
27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి ఏ రోజు కూడా వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 సార్లు పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ తొలిసారి 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఆయన తన ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్తనంలో ఏనాడూ కూడా పార్టీ మారలేదు.