మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గిరిజ‌నుల‌పై అటవీ అధికారుల కాల్పులు.. ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు

By Mahesh RajamoniFirst Published Aug 10, 2022, 4:22 PM IST
Highlights

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో గిరిజనులపై అటవీశాఖ అధికారుల కాల్పుల నేప‌థ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను  డిమాండ్ చేశారు.
 

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గిరిజ‌నుల‌పై అటవీ అధికారుల కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గిరిజ‌న స‌మాజానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కుడు క‌మ‌ళ్ నాథ్ డిమాండ్ చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని విదిషాలోని అటవీప్రాంతం నుండి కలప అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో రాళ్లతో దాడి చేశారనే ఆరోపణలతో అటవీ అధికారులు వారిపై కాల్పులు జరపడంతో ఒక గిరిజనుడు మరణించాడు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్ల‌డించారు. అట‌వీ అధికారుల కాల్పుల్లో చైన్ సింగ్ అనే గిరిజ‌నుడు మృతి చెందగా, మహేంద్ర సింగ్, భగవాన్ సింగ్, మరో గుర్తు తెలియని వ్యక్తులు గాయపడ్డారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సమీర్ యాదవ్ తెలిపారు. డిప్యూటీ రేంజర్ నిర్మల్ సింగ్‌తో సహా అటవీ అధికారులను సస్పెండ్ చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

గుణ నుండి కలప స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం రాత్రి ఖాద్యపురా అటవీప్రాంతానికి ఒక బృందం వెళ్లినట్లు డివిజనల్ అటవీ అధికారి రాజ్‌వీర్ సింగ్ తెలిపారు. బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు ఏడెనిమిది మంది చెక్కతో కనిపించారు. వారిని అరెస్టు చేసేందుకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు కానీ రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసమే అధికారులు కాల్పులు జరిపారని ఆయన అన్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యాయ విచారణకు ఆదేశించారని, మృతుడితో పాటు కాల్పుల్లో గాయపడిన మరో ముగ్గురి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అట‌వీ అధికారుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుడి కుటుంబానికి  20 లక్షల రూపాయ‌ల ఆర్థిక సాయంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒక‌రికి  ఉద్యోగం ఇస్తామ‌ని వెల్ల‌డించారు. అలాగే, గాయపడిన వారికి ₹ 5 లక్షలు ఆర్థిక సాయం  ఇవ్వబడుతుంది తెలిపారు. 

కాగా, గిరిజ‌నుల‌పై అటవీ అధికారుల కాల్పులు జ‌ర‌ప‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయ వేడిని ర‌గిల్చింది. అధికార యంత్రాంగం అమాయ‌క గిరిజ‌నుల‌పై కాల్పులు జ‌రిపింద‌ని ఆరోపిస్తున్నాయి. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను డిమాండ్ చేశారు.  దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్నా, ప్రభుత్వం ఆదివాసీలపై అణచివేతకు పాల్పడుతున్న ప్రచారం నుంచి వెనక్కి తగ్గడం లేదన్నారు. స్వాతంత్య్ర భార‌తంలో ఇంకా గిరిజ‌నుల‌పై దాడులు కొన‌సాగుతున్నాయ‌నీ, దీనికి ప్ర‌భుత్వ‌మే కార‌ణమ‌ని ఆరోపించారు. 

click me!