తమిళనాడు కర్నాటక సరిహద్దుల్లోని అత్తిపల్లిలో ఓ బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు . అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. హోసూరు - బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
తమిళనాడు కర్నాటక సరిహద్దుల్లోని అత్తిపల్లిలో ఓ బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. షాపులో కొందరు కార్మికులు, సిబ్బంది చిక్కుకుపోయి ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని అతిపల్లిలో పటాకుల దుకాణాలు ఎన్నో రోజులుగా కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు దీపావళి సందర్భంగా పెద్ద సంఖ్యలో క్రాకర్స్ కొంటారు. దీపావళికి కొన్ని వారాలు మాత్రమే ఉండడంతో అత్తిపల్లి సమీపంలోని నవీన్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో బాణాసంచా అమ్మకానికి తీసుకొచ్చినట్లు సమాచారం.
శనివారం ప్రమాదవశాత్తూ నవీన్ షాపులో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు మరింతగా వ్యాపించి సమీపంలోని దుకాణాలకు వ్యాపించాయి. దీంతో 5 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో 12 మంది మరణించగా..రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచా కాలి బూడిదైంది. పేలుడు కారణంగా సమీపంలో పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాపులో కొందరు ఉద్యోగులు చిక్కుకుపోయి ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. హోసూరు - బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. పటాకుల షాపు ముందు ఆగి ఉన్న ఏడు ద్విచక్రవాహనాలు, వ్యాన్, కార్గో లారీ దగ్ధమైనట్లుగా తెలుస్తోంది.