ముఖ్యమంత్రి తండ్రిపై ఎఫ్ఐఆర్.. చట్టం ముందు అందరూ సమానులేనని సీఎం వ్యాఖ్య

By telugu teamFirst Published Sep 5, 2021, 3:05 PM IST
Highlights

చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ తండ్రి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినందుకు ఆయనపై రాయ్‌పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుపై సీఎం భుపేశ్ భగేల్ స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానులేనని, తండ్రిగా ఆయనను గౌరవిస్తున్నానని అన్నారు.
 

రాయ్‌పూర్: చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ తండ్రి నంద్‌కుమార్ భగేల్‌పై రాయ్‌పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ సంఘం నంద్‌కుమార్ భగేల్‌పై ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై సీఎం స్పందించారు. తండ్రిగా ఆయనను గౌరవిస్తున్నారని, కానీ, చట్టం ముందూ అందరూ సమానులేని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే నంద్‌కుమార్ భగేల్ బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. బ్రాహ్మణులను ఊళ్లల్లోకి రానీయకుండా భారత గ్రామీణులను కోరుతున్నట్టు పేర్కొన్నారు. తాను ఇతర వర్గాలతో చర్చించి వారిని బహిష్కరించడానికి ప్రయత్నిస్తారని అన్నారు. వారిని తిరిగి వోల్గా నది తీరానికి పంపాలని వివాదాస్పదంగా మాట్లాడారు. 

ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సర్వ బ్రాహ్మణ సమాజ్ డీడీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రెండు వర్గాల శత్రుత్వాన్ని పెంచే యత్నం, అశాంతిని రగిల్చే కుట్రల కింద ఆయనపై కేసు నమోదైంది.

సీఎం భుపేశ్ భగేల్ ఈ ఎఫ్ఐఆర్‌పై స్పందించారు. ‘చట్టం ముందు అందరూ సమానులే. నేను 86ఏళ్ల నా తండ్రిని గౌరవిస్తాను. కానీ, అశాంతిని రగిల్చే ఆయన వ్యాఖ్యలను సమర్థించను. చత్తీస్‌గడ్ ప్రభుత్వం అన్ని మతాలు, అన్ని వర్గాలు, సంస్కృతిని గౌరవిస్తుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసిన నా తండ్రి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేవే. ఆయన వ్యాఖ్యలపై నేనూ కలత చెందుతున్నాను’ అని అన్నారు. 

‘మా రాజకీయ దృక్పథాలు, నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తాను. కానీ, ఒక ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలను భంగం కలిగించే ఆయన తప్పును క్షమించలేను’ అని స్పష్టం చేశారు.

click me!