
కన్నీటికే కన్నీరు తెచ్పించే కథ ఇది. ఓ తొమ్మిదేండ్ల చిన్నారి చిత్రహింసల గాధ.. కన్న కూతురని చూడకుండా ఓ తండ్రి తన రెండో భార్యతో కలిసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ చిన్నారిపై విచక్షణారహితంగా వ్యవహరించాడు. ఇనుప చువ్వాలతో వళ్లంతా వాతలు పెట్టడం. కిందపడేసి కొట్టడం. కాళ్లతో తొక్కాడం వంటి అరాచాకలకు పాల్పడేవాడు. సవితి తల్లి కూడా.. కనికరం లేకుండా వ్యవహరించింది. చిన్నారి అని చూడకుండా చిత్రహింసలు గురి చేసింది. భర్త అండ చూసుకుని మరింత రెచ్చిపోయింది.
వారి నరకయాతనను భరించలేక బోరున విలపిస్తున్నా ఆ కర్కశుడైన కన్నతండ్రి, సవతి తల్లి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా పైశాచికానందం పొందుతూ వచ్చారు. చివరకు ఆ చిత్రహింసలు భరించలేని ఆ బాలిక వారి చెర నుంచి తప్పించుకుంది. వారి నివాసానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని మోటారు గదిలో దాక్కుంది. ఆ బాలిక పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు, చుట్టుపక్కల వారు బాలల హక్కు సంఘానికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసుల సహకారంతో ఆ బాలికకు విముక్తి కల్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలికకు వైద్యం జరుగుతున్నట్టు తెలిపారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని మొగప్పైర్ సమీపంలోని ధరాపురంలో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. మొగప్పైర్ సమీపంలోని ధరాపురంలో కాంప్లెక్స్‌లో రమేష్, తన రెండో భార్య కీర్తన. రమేష్ మొదటి భార్య కూతురు కలిసి నివాసం ఉంటున్నారు. అయితే.. ఆ తొమ్మిదేళ్ల బాలిక అంటే.. రమేష్, కీర్తనలకు అసలు ఇష్టం లేదు. బాలికకు తండ్రి, సవతి తల్లి తరచూ కొడుతుండే వారు. నానా చిత్రహింసలకు గురి చేసేవారు. తన తండ్రి, సవితి తల్లి చిత్రహింసలు భరించలేక ఆ తొమ్మిదేళ్ల బాలిక ఇంటి నుంచి పారిపోయింది. నోలంబూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని మోటారు గదిలో దాదాపు ఐదు గంటల పాటు దాక్కుంది.
కాంప్లెక్స్‌లోని సెక్యూరిటీ గార్డు మోటారు స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లి లోపల 5వ తరగతి విద్యార్థిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ఆమె కుడి చేతికి ఫ్రాక్చర్, శరీరం మొత్తం గాయాలు అయినట్లు గుర్తించారు. ఆ చిన్నారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి..ఆమె బాధను తెలుసుకున్నారు. బాలికకు ఐదేళ్ల నుంచి తండ్రి, సవతి తల్లి తరచూ కొడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. రమేష్, కీర్తనలపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు
ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. “తొమ్మిదేళ్ల బాలికను సవతి తల్లి, కన్న తండ్రి చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బాలిక శరీరంపై కాలిన గాయాలతో సహా గాయాల గుర్తులు ఉన్నాయి. గురువారం బాలిక తన ఇంటి నుండి తప్పించుకుని, వారి ఇంటి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని రిమోట్ మోటారు గదిలో దాక్కుంది. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు మోటారు ఆన్ చేయడానికి వెళ్లగా బాలిక కనిపించింది. బాలికపై గాయాలను గుర్తించి పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు.” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
మరోవైపు..ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తండ్రి రమేష్ నొలంబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఆ చిన్నారిని పోలీసులు జిల్లా బాలల సంరక్షణ విభాగానికి తరలించారు. తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికకు వైద్యసేవలు అందుతున్నాయని, బాలిక శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న తర్వాతే విచారణను పునఃప్రారంభిస్తామని జిల్లా బాలల సంరక్షణ విభాగంలోని సీనియర్ అధికారి తెలిపారు.